Why Fans Get Dusty: ఫ్యాన్ నిరంతరం తిరుగుతున్నా దుమ్ము ఎందుకు పేరుకుపోతుంది?
వేసవిలో ఫ్యాన్ ఒక్క క్షణం ఆగిందంటే చాలు, చెమటలు కక్కి ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అందుకే ఇళ్లలో ఫ్యాన్లు 24 గంటల పాటు నిరంతరాయంగా తిరుగుతుంటాయి. అయితే, ఇంత వేగంగా తిరిగే ఫ్యాన్ రెక్కల మీద మందపాటి దుమ్ము పొర ఎలా పేరుకుపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాన్ వేగంగా తిరిగినా దుమ్ము ఎగిరిపోకపోవడానికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవే!

నిరంతరం గాలిని అందించే ఫ్యాన్ రెక్కల మీద ధూళి కణాలు ఎలా స్థిరపడతాయో తెలుసా? ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. దీని వెనుక భౌతికశాస్త్ర సూత్రాలు దాగి ఉన్నాయి. ఫ్యాన్ తిరిగే వేగం కూడా ఈ ధూళిని తొలగించలేకపోవడానికి గల అసలు కారణాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
స్థిర విద్యుత్, ఆకర్షణ ఫ్యాన్ రెక్కలు వేగంగా తిరుగుతున్నప్పుడు, గాలిలో ఉండే ధూళి కణాలతో నిరంతరం ఘర్షణకు లోనవుతాయి. ఈ రాపిడి కారణంగా ఫ్యాన్ రెక్కల ఉపరితలంపై స్థిర విద్యుత్ (Static Electricity) అనే ఆవేశం ఏర్పడుతుంది. గాలిలో తేలియాడే ధూళి కణాలు కూడా విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటాయి. అయస్కాంత ధృవాలు ఒకదానికొకటి ఎలాగైతే అతుక్కుంటాయో, ఫ్యాన్ రెక్కలకు ఏర్పడిన ఆవేశం దుమ్ములోని ఆవేశం కలిసిపోయి కణాలను రెక్కలకు గట్టిగా అతుక్కునేలా చేస్తాయి. దీనివల్ల ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నప్పటికీ దుమ్ము ఎగిరిపోకుండా రెక్కలపైనే పేరుకుపోతుంది.
బౌండరీ లేయర్ ద్రవ గతిశాస్త్రంలోని ‘బౌండరీ లేయర్ ఎఫెక్ట్’ ప్రకారం, ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నప్పుడు వాటి ఉపరితలం వెంబడి గాలి ఒక నిశ్చలమైన పొరగా ఏర్పడుతుంది. ఈ పొరలో గాలి కదలిక చాలా తక్కువగా ఉండటం వల్ల, ధూళి కణాలు ఆ పొరలో చిక్కుకుపోతాయి. ఒకసారి కణాలు అక్కడ స్థిరపడ్డాక, అవి మరింత దుమ్మును ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, భారత్ వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గాలిలోని తేమ ధూళి కణాలను తడిపి, వాటిని ఫ్యాన్ రెక్కలకు జిగురులా అతుక్కునేలా చేస్తుంది. దీనివల్ల కాలక్రమేణా మందపాటి దుమ్ము పొర ఏర్పడుతుంది, ఇది ఫ్యాన్ గాలిని విసిరే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
శుభ్రం చేసే పద్ధతి సీలింగ్ ఫ్యాన్లు ఎత్తులో ఉండటం వల్ల మనం తరచు వాటిని శుభ్రం చేయలేము. దీనివల్ల దుమ్ము పేరుకుపోవడం వేగవంతం అవుతుంది. ఫ్యాన్‌ను కొత్తదానిలా మెరిపించడానికి ముందుగా పొడి గుడ్డతో దుమ్మును తుడవండి. ఆ తర్వాత బేకింగ్ సోడా, వెనిగర్ కొద్దిగా నీటిని కలిపిన ద్రావణంతో రెక్కలను తుడిస్తే, అవి కొత్తవాటిలా మెరుస్తాయి. కేవలం వాతావరణం మాత్రమే కాకుండా, ఈ భౌతిక ప్రక్రియల వల్లే ఫ్యాన్లు త్వరగా దుమ్మును ఆకర్షిస్తాయి.
గమనిక: ఈ సమాచారం భౌతిక శాస్త్ర సూత్రాలు గృహ నిర్వహణ చిట్కాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫ్యాన్‌ను శుభ్రం చేసేటప్పుడు కచ్చితంగా పవర్ స్విచ్ ఆఫ్ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది.
