చేతి వేళ్లను చూసి మీ తెలివితేటలు చెప్పొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ రహస్యాలు..
సాధారణంగా అరచేతిలోని రేఖలను చూసి జాతకం చెబుతారని మనకు తెలుసు. కానీ మీ చేతి వేళ్ల పొడవును చూసి మీ మెదడు ఎంత వేగంగా పనిచేస్తుందో, మీ మేధస్సు స్థాయి ఎంతో చెప్పవచ్చని సైన్స్ చెబుతోంది. వినడానికి వింతగా ఉన్నా.. బ్రిటన్‌లోని స్వాన్సీ విశ్వవిద్యాలయ నిపుణులు జరిపిన తాజా పరిశోధనలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

సాధారణంగా ఒక వ్యక్తి తెలివితేటలను వారి చదువునో లేదా వారు మాట్లాడే తీరునో చూసి అంచనా వేస్తాం. కానీ ఇప్పుడు మీ చేతి వేళ్లను చూసి మీ మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. బ్రిటన్‌లోని స్వాన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు ఇటీవల జరిపిన అధ్యయనంలో వేళ్ల పొడవుకు, మెదడు అభివృద్ధికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని కనుగొన్నారు. ఈ పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏమిటి ఈ 2D:4D నిష్పత్తి మ్యాజిక్?
శాస్త్రవేత్తలు ఈ ఆసక్తికరమైన సంబంధాన్ని 2D:4D రేషియో అని పిలుస్తున్నారు. ఇందులో 2D అంటే మనం దేన్నైనా చూపించడానికి వాడే చూపుడు వేలు. 4D అంటే ఉంగరం వేలుకు ధరించే ఉంగరపు వేలు అని అర్ధం. ఈ వేళ్ల పొడవు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది. గర్భంలో పిండం ఎదుగుతున్న సమయంలో లభించే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ల సమతుల్యతపై ఈ వేళ్ల పొడవు ఆధారపడి ఉంటుంది.
పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన ఫలితాలు
దాదాపు 225 మంది చిన్నారులపై జరిపిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో నిపుణులు కొన్ని కీలక విషయాలను గుర్తించారు..
పెద్ద తల: ఎవరికైతే ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉంటుందో, వారి తల చుట్టుకొలత కూడా తులనాత్మకంగా పెద్దదిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మానసిక వికాసం: శాస్త్రీయ కోణంలో పెద్ద తల చుట్టుకొలత అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న, సామర్థ్యం గల మెదడుకు సంకేతం. అంటే చూపుడు వేలు పొడవుగా ఉన్న పిల్లల్లో మెదడు పనితీరు ఇతరులకంటే చురుగ్గా ఉండే అవకాశం ఉంది.
అబ్బాయిల్లో స్పష్టత: ఈ హార్మోన్ల ప్రభావం అమ్మాయిల కంటే అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తుందని, పొడవైన చూపుడు వేలు వారి మేధస్సుకు ఒక సూచిక అని ఈ అధ్యయనం వెల్లడించింది.
గర్భంలోనే పునాది
మన శరీర ఆకృతి కేవలం యాదృచ్చికం కాదని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. గర్భంలో పిండం దశలో ఉన్నప్పుడు తలెత్తే హార్మోన్ల మార్పులే ఒక వ్యక్తి యొక్క శారీరక ఆకృతిని మాత్రమే కాకుండా, వారి మానసిక భవిష్యత్తును, మేధస్సును కూడా డిజైన్ చేస్తాయి. అంటే మన చేతి వేళ్లు మన మెదడు సామర్థ్యానికి అద్దం పడుతున్నాయన్నమాట.
చేతి వేళ్ల పొడవుకూ, మెదడుకూ ఉన్న ఈ సంబంధం వినడానికి వింతగా ఉన్నా.. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, తెలివితేటలు అనేవి కేవలం శారీరక ఆకృతిపైనే కాకుండా మనం నేర్చుకునే విషయాలు, పెరిగే వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటాయని మర్చిపోకూడదు.
