AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: ప్రేమలో మితిమీరిన ఆధిపత్యం ప్రమాదకరమా? భార్యాభర్తల బంధాన్ని నాశనం చేసే 5 చెడు అలవాట్లు ఇవే!

ప్రేమ అనేది రెండు మనసులను కలిపే ఒక అందమైన బంధం. అయితే, ఆ ప్రేమే మితిమీరి ఊపిరాడనీయని స్థాయికి చేరితే ఆ సంబంధాలు తీవ్ర ప్రమాదంలో పడతాయి. వ్యక్తిగత స్వేచ్ఛ లోపించడం, భాగస్వామిపై అతిగా ఆధారపడటం, అపార్థాలు, అనుమానం వంటివి వివాహ బంధంలో కలతలు రేపుతాయి. ఇద్దరి మధ్య నమ్మకం, స్వేచ్ఛ, సమానత్వం ఉన్నప్పుడే ఏ బంధమైనా కలకాలం పదిలంగా నిలుస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీసే ఆ ఐదు ప్రధాన కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

Relationship Tips: ప్రేమలో మితిమీరిన ఆధిపత్యం ప్రమాదకరమా? భార్యాభర్తల బంధాన్ని నాశనం చేసే 5 చెడు అలవాట్లు ఇవే!
Relationship Tips Telugu
Bhavani
|

Updated on: May 14, 2026 | 6:36 PM

Share

ఏ సంబంధానికైనా ప్రేమే పునాది అని మనందరికీ తెలిసిందే. కానీ, మితిమీరిన అనుబంధం లేదా ‘ఊపిరాడనంత ప్రేమ’ (Suffocating Love) మీ వివాహ బంధాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆధునిక మనస్తత్వ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ అనేది ఒకరిని మన ఆధీనంలో ఉంచుకునే భావనగా (Possessiveness) మారినప్పుడు, అది భద్రతను, ఆనందాన్ని ఇవ్వడానికి బదులుగా మానసిక ఉద్రిక్తతను సృష్టిస్తుంది. జాన్ బౌల్బీ మేరీ ఐన్స్‌వర్త్ వంటి మానసిక శాస్త్ర పరిశోధకుల ప్రకారం, మనం బాల్యంలో మన తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నామో, పెద్దయ్యాక మన జీవిత భాగస్వాములతో ప్రవర్తించే తీరు కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. తమ భాగస్వామి తమను ఎక్కడ వదిలిపెడతారో లేదా తమపై ఎక్కడ ప్రేమను తగ్గిస్తారో అనే నిరంతర భయం (Insecurity) సంబంధాలను నాశనం చేస్తుంది. వివాహ బంధంలో ఆందోళనకు ప్రధాన కారణాలైన ఐదు ముఖ్యమైన సమస్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం (Lack of Personal Freedom): భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండటం సహజమే కానీ, ఒకరి పనుల్లో మరొకరు ప్రతి చిన్న విషయానికీ జోక్యం చేసుకోవడం, వారిని నియంత్రించడానికి ప్రయత్నించడాన్ని ‘ఊపిరాడనీయని ప్రేమ’ అంటారు. వివాహం అయినప్పటికీ ప్రతి వ్యక్తికి కొంత వ్యక్తిగత స్వేచ్ఛ, తమకంటూ కొంత సమయం (Me Time) అవసరం. భాగస్వామికి ఆ కనీస సమయం, స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల వారిలో చికాకు, ఆందోళన పెరిగి బంధంలో దూరం పెరుగుతుంది.

2. మితిమీరిన ఆధిపత్యం (Over Dominance): ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామిపై కొద్దిగా ఆధిపత్యం లేదా హక్కును ప్రదర్శించడం మామూలే. కానీ ఆ ఆధిపత్యం శృతి మించి, అనుమానంగా మారినప్పుడు అది సంబంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భాగస్వామి ప్రతి కదలికను, చిన్న విషయాన్ని అదుపు చేయాలని చూడటం వల్ల ఆ అందమైన బంధం కాస్తా ఒక భారంలా మారిపోతుంది.

3.కమ్యూనికేషన్ గ్యాప్: భార్యాభర్తల మధ్య స్పష్టమైన మాటలు, కమ్యూనికేషన్ లేకపోవడం అత్యంత ప్రమాదకరం. తరచు జంటలు తమ మధ్య ఉన్న మనస్పర్థలను బయటకు చెప్పకుండా దాచుకుంటారు. బయటకు అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపించినా, లోపల రగులుతున్న అసంతృప్తి ఒకానొక దశలో పెద్ద గొడవలకు దారితీస్తుంది. స్వేచ్ఛగా మాట్లాడుకోకపోవడం వల్లే అపార్థాలు పెరిగిపోయి బంధాలు తెగిపోతాయి.

4. భావోద్వేగాలపై అతిగా ఆధారపడటం (Emotional Over-dependence): చాలామంది తమ సంతోషం పూర్తిగా తమ భాగస్వామి ప్రవర్తన, మానసిక స్థితిపైనే ఆధారపడి ఉందనుకుంటారు. ఇది ఒక విధమైన “భావోద్వేగ ఉచ్చు”. మన ఆనందం కోసం ఇతరులపై అతిగా ఆధారపడటం వల్ల మనలో నిరంతరం భయం, అభద్రతా భావం వెంటాడుతాయి. ఈ లక్షణం సంబంధంలో తీవ్రమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది.

5. గతాన్ని తవ్వుకోవడం (Digging Up The Past): భాగస్వామి గతంలో చేసిన తప్పులను ప్రతిసారీ ఎత్తి చూపడం, గొడవ జరిగిన ప్రతిసారీ పాత విషయాలను తీసుకురావడం ఏ బంధాన్నైనా సులభంగా నాశనం చేస్తుంది. ఇది ప్రస్తుత సంతోషాన్ని నాశనం చేయడమే కాకుండా, భాగస్వామి మనసులో మీ పట్ల ఉన్న ప్రేమని చంపి, భయాన్ని లేదా అసహ్యతను సృష్టిస్తుంది.

ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో ప్రేమ, నమ్మకం, గౌరవంతో పాటు సమానత్వం కూడా చాలా ముఖ్యం. మీరు కూడా మీ భాగస్వామి పట్ల పై అలవాట్లను కలిగి ఉంటే, సంబంధం దెబ్బతినకముందే వాటిని మార్చుకోండి. ఈ చిన్న మార్పులే మీ వివాహ బంధాన్ని కాపాడి, కలకాలం సంతోషంగా ఉండేలా చేస్తాయి.

Follow Us