రేపటి నుంచే TV9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2వ సీజన్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
TV9 Corporate Badminton Championship: కార్పొరేట్ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రతిష్టాత్మక వేదిక సిద్ధమైంది. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్-2' మే 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.

TV9 Corporate Badminton Championship: సాధారణంగా ఏసీ గదులు, కంప్యూటర్ స్క్రీన్ల మధ్య గడిపే కార్పొరేట్ ఉద్యోగుల కోసం టీవీ9 నెట్‌వర్క్ ఒక అద్భుతమైన క్రీడా వేదికను నిర్మించింది. తొలి సీజన్‌లో అగ్రశ్రేణి కంపెనీల నుంచి లభించిన అపూర్వ స్పందనతో, ఇప్పుడు రెండో సీజన్‌ను మరింత భారీగా నిర్వహిస్తున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, గూగుల్, టీసీఎస్ (TCS), డెల్, యాక్సెంచర్, ఎల్ అండ్ టీ, పెగాసిస్టమ్స్ ఇండియా, డెలాయిట్, ఒరాకిల్, మైహోమ్ గ్రూప్, శ్రోడింగర్ ఇండియా, పీడబ్ల్యూసీ (PWC), జేపీ మోర్గాన్ చేజ్, హెచ్‌సీఎల్ టెక్, కట్‌ఫిట్, మహా సిమెంట్, ఎంఫాసిస్, ఉబెర్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి అగ్రశ్రేణి సంస్థల ఉద్యోగులు పాల్గొంటున్నారు.
పుల్లెల గోపిచంద్ మార్గదర్శకత్వంలో మరింత గ్రాండ్‌గా సీజన్ 2..
భారత బ్యాడ్మింటన్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దిగ్గజ క్రీడాకారుడు, పద్మభూషణ్ పుల్లెల గోపిచంద్ ఈ టోర్నమెంట్‌తో భాగస్వామ్యం కావడం విశేషం. గచ్చిబౌలిలోని ఆయన సొంత అకాడమీలో ఈ పోటీలు జరగనుండటం క్రీడాకారులకు గొప్ప ప్రేరణనిస్తోంది. ఆయన పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మే 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ పోటీలు జరగనున్నాయి.
తొలి సీజన్ ఘన విజయం..
తొలి సీజన్‌కు అగ్రశ్రేణి సంస్థల నుంచి అద్భుత స్పందన వచ్చింది. గూగుల్, డెల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో 300 మందికి పైగా క్రీడాకారులు, 64కిపైగా కార్పొరేట్ జట్లు పాల్గొని.. 1000కిపైగా మ్యాచ్‌లు నిర్వహించారు.
పోటీ విభాగాలు..
టీమ్ ఛాంపియన్‌షిప్ (పురుషుల విభాగం): మెన్ సింగిల్స్ (2 మ్యాచ్‌లు), మెన్ డబుల్స్
ఒక జట్టులో కనీసం 3 నుంచి గరిష్టంగా 5 మంది ఆటగాళ్లు ఉండాలి. అందరూ ఒకే సంస్థకు చెందినవారే కావాలి.
ఓపెన్ కేటగిరీ (వ్యక్తిగతంగా): మెన్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ వీటిలో వేర్వేరు సంస్థలకు చెందినవారు కూడా పాల్గొనవచ్చు.
భారీ బహుమతులు..
విజేతలకు మొత్తం రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలు, ప్రత్యేక గుర్తింపులు అందించనున్నారు.
ఈవెంట్ వివరాలు..
తేదీలు: మే 15–17, 2026
వేదిక: పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, గచ్చిబౌలి, హైదరాబాద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
