Brisk Walking: బ్రిస్క్ వాకింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? గుండె జబ్బులకు ఛూమంత్రం..
గుండె సమ్యలతో బాధపడేవారికి నిపుణులు అద్భుత సలహా ఇస్తున్నారు. అదే బ్రిస్క్ వాకింగ్. దీనిని చేయడం వల్ల గుండె ఆరోగ్యంతోపాటు బరువు కూడా సులవుగా తగ్గొచ్చు. అసలింతకీ ఇది ఎలా చేయాలంటే..
మన దేశంలో గుండె జబ్బుల రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అధిక మంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడితో కూడిన జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు. అంతే కాకుండా వేయించిన ఆహారం ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, పొగతాగడం వంటి చెడు అలవాట్ల కారణంగా ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరినీ వేధిస్తుంది. ఇలాంటి జీవనశైలి నుంచి బయటపడేందుకు పచ్చి కూరగాయలు, పండ్లను తీసుకుంటూ కొంత సమయం పాటు శారీరక శ్రమ చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ కేవలం 2 కిలోమీటర్లు నడవడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయట. కార్డియాక్ పేషెంట్లు మాత్రం నిపుణుల సలహా మేరకు ఈ తరహా వాకింగ్ చేయాలి. రోజూ 2 కిలోమీటర్లు నడవడం వల్ల శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
బ్రిస్క్ వాకింగ్ అంటే ఏమిటి?
ఈ తరహా నడకలో మనం సాధారణ నడక కంటే కొంచెం వేగంగా నడవాలి. కానీ పరుగెత్తకూడదు. ఇందులో, ఒక వ్యక్తి గంటలో 3 మైళ్లు లేదా నిమిషానికి 100 అడుగులు నడవాలి. ఈ సమయంలో హృదయ స్పందన నిమిషానికి 110 నుండి 120 బీట్లకు వెళుతుంది.
రోజూ 2 కిలోమీటర్లు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు
- గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ప్రతిరోజూ బ్రిస్క్ వాక్ చేస్తే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఇలా నడవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. చురుకైన నడకను అనుసరించడం ద్వారా మనం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
- ప్రస్తుతం చిన్నవయసులోనే అనేక మంది కీళ్ల నొప్పులు వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది పెరిగిన యూరిక్ యాసిడ్ లేదా ఆర్థరైటిస్‌తో సహా ఇతర సమస్యల వల్ల సంభవిస్త8ఉంది. కాబట్టి దీని నుండి ఉపశమనం పొందాలంటే, ప్రతిరోజూ బ్రిస్క్ వాకింగ్ ప్రారంభించడం మంచిది.
- వారానికి 5 సార్లు 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే బరువు అదుపులో ఉంటుంది. ఇలా నడవడం వల్ల అదనపు కేలరీలు ఖర్చవుతాయి. కాబట్టి మీ బరువును నియంత్రించుకోవచ్చు.
బ్రిస్క్ వాకింగ్ ప్రారంభించే ముందు, మీరు ధరించే బూట్లు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే సరైన షూ వేసుకోకపోవడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. అందుకే పాదరక్షల ఎంపిక చాలా ముఖ్యం. లేదంటే రోజంతా అలసట, కాళ్ల నొప్పులకు దారితీయవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో వాయు కాలుష్యం పెరిగింది. కాబట్టి శ్వాసకోశ సమస్యలను నివారించడానికి భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీరు బయటకు వెళితే, మాస్క్ ధరించడం మర్చిపోకూడదు. అంతేకాకుండా, ఇది గుండె సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే కొందరు ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వాకింగ్ చేసేటప్పుడు శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తారు. కానీ అది తప్పు. శరీరానికి విశ్రాంతి అవసరమైనప్పుడు అతిగా శ్రమించకూడదు.