Viral Video: ‘మీరిక మారరా..? ఇంకెన్ని ఘోరాలు జరగాలి’ సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడిపోయిన యువతి! వీడియో వైరల్
యువతలో సెల్ఫీ పిచ్చీ నానాటికీ ముదురుతుంది. ప్రమాదకర రీతిలో సెల్ఫీ దిగడం, రీల్స్ చేయడం కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతున్నారు. తాజాగా ఓ యువతి ఎత్తైన జలపాతం దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగేందుకు యత్నించింది. అంతే అమాంతం జారి లోయలో పడిపోయింది..
తుముకూరు, అక్టోబర్ 30: జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన ఓ బీటెక్ విద్యార్ధిని ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈ ఘటనలో యువతి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. దాదాపు 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతిని రక్షించగలిగారు. ఈ సంఘటన కర్ణాటకలోని టుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటకలోని టుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలోని సరస్సు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండలా మారింది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు ఆకర్షణా మారాయి. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున వీటి అందాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మందరగిరి కొండ జలపాతాన్ని చూసేందుకు బెంగళూరుకు చెందిన తన స్నేహితురాలితో కలిసి బీటెక్ విద్యార్ధిని జి హంస గౌడ (19) ఆదివారం వెళ్లింది. 30 అడుగుల ఎత్తైన కొండపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం సరస్సులో పడుతున్న దృశ్యం చూసేందుకు ఎంతో రమ్యంగా ఉంటుంది. దీంతో హంస అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. అనంతరం అక్కడి పెద్దపెద్ద బండ రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. గమనించిన స్నేహితురాలు సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
A 19-year-old girl who had fallen into a lake while trying to take selfies rescued in #Karnataka‘s #Tumakuru. She spent a harrowing 12-hour ordeal before rescue personnel granted her a fresh lease of life. pic.twitter.com/JIa29zn8jT
— Hate Detector 🔍 (@HateDetectors) October 28, 2024
అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందితో పాటు పోలీసు బృందం సంఘటనా స్థలానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. కానీ చీకటిగా ఉండటంతో కొండకు దిగువున 20 అడుగుల లోతులో రాళ్ల మధ్య చిక్కుకుపోయిన యువతిని కాపాడటం కష్టం మారింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేకపోయారు. దీంతో రాత్రంతా యువతి బండరాళ్ల మధ్యనే ఉండవల్సి వచ్చింది. తెల్లవారు జామున రెస్క్యూ ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది ఇసుక బస్తాలు వేసి పారుతున్న నీటిని మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు. రాత్రంతా వారికి ఆమె కనిపించలేదు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత, రాళ్ల మధ్య హంస సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి, హంసను కాపాడగలిగారని తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కెవి విలేఖరులకు తెలిపారు. తీవ్రగాయలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించినట్లు అశోక్ చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆంక్షలు విధించామని, టూరిస్టులు కూడా బాధ్యతతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. బండరాళ్ల మధ్యలో ఛాతిలోతు నీటిలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపానని, సెల్ఫీ కోసం ఇలాంటి రిస్క్ ఎవరూ చేయొద్దని హంస తెలిపింది.