Snakes: పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పాములంటే అందరికీ భయమే! అవి మన సమీపం నుంచి వెళ్లినా హడలెత్తిపోతాం. అలాంటి ఏకంగా ఇంట్లోకే వస్తే..? చాలా ప్రమాదం కదా..! అందువల్ల పాములను ఇంట్లోకి రాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం పదండి....
దాదాపు అందరికీ పాములంటే చచ్చేంత భయం. కారణం అవి కాటేస్తే బతకటం కొద్దిగా కష్టమే. ఒకవేళ బతికినా వాటి విష ప్రభావం జీవితాంతం ఎంతో కొంత మనపై ఉంటుంది. సాధారణంగా వీధిలో లేదా పొలం గట్లపై పాములు కనిపిస్తే హడలెత్తిపోతాం. అవి విషపూరితమైనా కాకున్నా ముందుగా వాటిని చూడటంతోనే కాళ్లకు పనిచెప్తాం. అలాంటిది మన ఇంట్లోకే అవి వస్తే..! పైప్రాణాలు పైకే పోతాయి. పాములు మనుషుల పరిసరాల్లోకి రావడం సాధారణమే అయినప్పటికీ, అది చాలా ప్రమాదకరం. అందువల్ల పాములు మన ఇంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి
పాములు ఎక్కువగా పొదలు, భవన శిథిలాలు లేదా రాళ్ల కింద ఆశ్రయం పొందుతాయి. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇంటి చుట్టూ, పెరడులో ఉంటే పొదలను కత్తిరించుకోవాలి. చెత్త లేకుండా చూసుకోవాలి. సాధారణంగా ఇంటిని నిర్మించడమో లేదా మరమ్మతులు చేయించినప్పుడు కొంత వేస్ట్ వస్తుంది. అంటే విరిగిన ఇటుకలు, కాంక్రీట్‌ను పక్కన పారేస్తుంటాం. వీటిని తొలగించుకుంటే మంచిది.
అనవసరమైన వస్తువులు
కొంతమంది ఇంట్లో ఖాళీ స్థలం ఉందని అనవసరమైన వస్తువులను అజాగ్రత్తగా ఉంచుతారు. అంటే విరిగిన కుర్చీలు, పాత సామాన్లు ఇలా. ఇది చాలా పొరపాటు. వీటిని ఎప్పటికప్పుడు తీసేస్తే బెటర్.
సీల్ రంధ్రాలు, పగుళ్లు
పాములు తరచుగా పైకప్పు లేదా గోడలలోని రంధ్రాలు, పగుళ్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కిటికీలు, గోడలకు పగుళ్లు లేదా రంధ్రాలు ఉంటే వెంటనే మరమ్మతు చేయించండి. ముఖ్యంగా గోడ నేలకు తాకే చోట రంధ్రాలు లేకుండా చూసుకోండి.
డ్రెయిన్ పైపులు
మురుగు నీటి పైపుల ద్వారా పాములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రెయిన్ పైపులను నెట్టింగ్ మెటీరియల్‌తో కప్పడం మంచిది. అలాగే మురుగు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
చెట్లు, మొక్కలు పెంచడం ద్వారా..
బంతిపూలు, కాక్టస్, వేప వంటి కొన్ని మొక్కలను ఇంటి చుట్టూ పెంచడం ద్వారా పాములు రాకుండా నిరోధించవచ్చు. కలబంద, బంతిపూల వాసన పాములకు నచ్చదు. వేప చెట్టు చేదు స్వభావం పాములు దాని దగ్గరకు రాకుండా చేస్తుంది.
పిల్లులు, కుక్కలు
పిల్లులు, కుక్కలకు పాముల ఉనికిని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు, ఇవి పాములను తరిమి కొడతాయి. కాబట్టి ఇంట్లోకి పాములు రాకుండా పిల్లులు లేదా కుక్కలను ఇంట్లో పెంచుకోండి.
పాములను తరిమికొట్టడానికి సాయపడే ఉత్పత్తులు
కొన్ని రకాల రసాయనాలు పాములను రాకుండా చేస్తాయి. ఇలాంటి స్నేక్ రిపెల్లెంట్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని కొని ఇంటి చుట్టూ చల్లితే పాములను రాకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా స్ప్రే బాటిల్లో వేప నూనె పోసి ఇంటి చుట్టూ చల్లినా దాని వాసన వల్ల పాములు రావు.