వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన పని ఉండదు.. లైట్ తీసుకుంటే..
ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాలు అయితే మొదలయ్యాయి కానీ.. వీటితో పాటే రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా క్యూ కడుతుంటాయి. ఈ కాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు రావడం చాలా సాధారణం. ఇలాంటి సమయంలో హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా, మన రోగనిరోధక శక్తిని పవర్ ఫుల్‌గా మార్చుకోవాలంటే కొన్ని సీజనల్ పండ్లను కచ్చితంగా తినాలి.

రుతుపవనాల రాకతో పలు చోట్ల వానలు దంచికొడుతున్నాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. వర్షాకాలంలో రోగాల బారిన పడడం ర్వసాధారణం. ఈ కాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా జలుబు, జ్వరం, దగ్గు వంటి కాలానుగుణ ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అంతేకాకుండా గాలిలో తేమ శాతం పెరగడం వల్ల అలర్జీలు, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వాతావరణ మార్పులను తట్టుకుని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. ఇమ్యూనిటీని బలోపేతం చేయడానికి సరైన ఆహార నియమాలను పాటించడంతో పాటు, ఈ కాలంలో లభించే కొన్ని ప్రత్యేకమైన పండ్లను మన డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బొప్పాయి
విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బొప్పాయి రోగనిరోధక శక్తిని అద్భుతంగా బలపరుస్తుంది. దీనిలోని పాపైన్ వంటి ప్రత్యేక ఎంజైమ్‌లు జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. వర్షాకాలంలో కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి బొప్పాయి ఒక మంచి ఔషధం.
నేరేడు పండ్లు
వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ ఊదా రంగు పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామూన్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు విపరీతంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి.
పియర్ పండ్లు
పియర్ పండ్లు ఫైబర్, విటమిన్ కె లకు కేరాఫ్ అడ్రస్. ఇవి జీర్ణ వ్యవస్థను క్లీన్ చేయడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే గ్యాస్, ఎసిడిటీ సమస్యలను ఇవి అదుపు చేస్తాయి. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా తోడ్పడుతుంది.
దానిమ్మ
పాలీఫెనాల్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వర్షాకాలపు అనారోగ్యాల వల్ల శరీరంలో వచ్చే వాపులను, నీరసాన్ని తగ్గించి బాడీ త్వరగా కోలుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
రాంబుటాన్
చూడటానికి కాస్త భిన్నంగా ఉండే రాంబుటాన్ పండులో నీరు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇది వర్షాకాలంలో శరీరానికి అవసరమైన తేమను అందిస్తూనే, కాలానుగుణంగా వచ్చే వైరల్ జ్వరాల నుండి అదనపు రక్షణ కల్పిస్తుంది.
ప్లమ్స్
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో కూడిన ప్లమ్స్.. వర్షాకాలంలో పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలోని సహజ సమ్మేళనాలు శరీరంలోకి హానికరమైన వైరస్‌లు ప్రవేశించకుండా అడ్డుకుని, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి.
అరటిపండ్లు
అరటిపండ్లలో పొటాషియం, పీచుపదార్థం, ప్రీబయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ఉత్తేజపరిచి, కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి తోడ్పడతాయి. తద్వారా వర్షాకాలంలో వచ్చే డయేరియా వంటి సమస్యలను నివారించవచ్చు.
ఆపిల్స్
“రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు” అనే సామెత వర్షాకాలానికి పక్కాగా సరిపోతుంది. ఆపిల్స్‌లో ఉండే ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోజంతా బాడీ యాక్టివ్‌గా ఉండేలా శక్తి స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
వర్షాకాలంలో బయట దొరికే జంక్ ఫుడ్‌కు కాస్త దూరంగా ఉంటూ.. ప్రకృతిసిద్ధంగా లభించే ఈ తాజా పండ్లను ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల డాక్టర్ల చుట్టూ తిరిగే పని లేకుండా హ్యాపీగా వర్షాకాలాన్ని ఆస్వాదించవచ్చు.
(గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించవలసిందిగా మనవి.)
