రాత్రంతా ఇంట్లోనే ప్రియుడు.. తెల్లారేసరికి భర్త మృతి! అసలు నిజం ఇదే
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కీర్‌లో మత్తు మాత్రలు కలిపి భర్తను నిద్రపుచ్చిన భార్య, అనంతరం ప్రియుడితో కలిసి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అనంతరం దానిని విష ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు దొరికిపోయింది..

బాఘ్‌పట్, జూన్ 15: ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల వ్యక్తిని అతని భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఈ ఘటనను పురుగుల మందు విషప్రయోగం వల్ల జరిగిన మరణంగా చూపించే ప్రయత్నం చేసింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా భార్యను తమదైన శైలిలో విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. దీంతో భార్యను అరెస్ట్ చేయగా, ప్రియుడు పరారీలో ఉన్నాడు. మృతుడిని సచిన్ దాగర్‌గా గుర్తించారు. శుక్రవారం రాత్రి సచిన్‌ను అతని భార్య రచనా, ఆమె ప్రియుడు సోను కలిసి హత్య చేసినట్లు తేలింది. రచనను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సమీప గ్రామమైన రాంఛడ్‌కు చెందిన సోను కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పురుగుల మందు కారణంగా అనారోగ్యానికి గురయ్యాడని కుటుంబానికి చెప్పిన భార్య
సచిన్ సోదరుడు నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున 3:33 గంటలకు రచనా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. శుక్రవారం పొలాల్లో పురుగుల మందు పిచికారీ చేసిన తర్వాత సచిన్ ఆరోగ్యం క్షీణించిందని, రాత్రి ఒక్కసారిగా పరిస్థితి విషమించిందని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు సచిన్‌ను బరౌత్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరో ఆసుపత్రికి రెఫర్ చేయగా, చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు ప్రకటించారు.
అంత్యక్రియల సమయంలో మెడపై గాయాలు కనిపించడంతో అనుమానం
అయితే అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న సమయంలో సచిన్ మెడపై గాయాల ముద్రలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అనంతరం సమీప ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజీలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి సచిన్ ఇంట్లోకి ప్రవేశించి, శనివారం తెల్లవారుజామున 3:28 గంటలకు బయటకు వెళ్లినట్లు కనిపించింది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో అసలు నిజం బయటపడింది. మొదట రచనా తన భర్త పురుగుల మందు ప్రభావంతోనే మరణించాడని పదేపదే చెప్పింది. అయితే సుదీర్ఘ విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించిందని బాఘ్‌పట్ ఎస్పీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు.
కీర్‌లో మత్తు మాత్రలు కలిపి ఇచ్చిన భార్య
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సోను మత్తు మాత్రలు తీసుకువచ్చాడు. వాటిని రచనా కీర్‌లో కలిపి తన భర్తకు తినిపించింది. సచిన్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత సోనుకు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. సోను సులభంగా ఇంట్లోకి రావడానికి రచనా ఉద్దేశపూర్వకంగా తలుపు తెరిచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి దిండుతో సచిన్ ముఖం, మెడను బలంగా నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. హత్య అనంతరం సోను దాదాపు మూడున్నర గంటల పాటు ఇంట్లోనే ఉండి, తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు దర్యాప్తులో తేలింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
విచారణలో రచన తనకు సోనుతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిందని తెలిపింది. అనతి కాలంలోనే ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడిందని చెప్పింది. అలాగే తన వైవాహిక జీవితంలో సంతోషంగా లేనని, భర్త తరచూ తనపై దాడి చేసేవాడని కూడా ఆరోపించింది. పోస్ట్‌మార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ తదితర ఆధారాలు కేసులో కీలక అంశాలను నిర్ధారించాయని పోలీసులు తెలిపారు. ప్రియుడితో కుమ్మక్కై మహిళ తన భర్తను హత్య చేసింది. ఆమెను అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న ప్రియుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తాం” అని ఎస్పీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు.
