AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?

సీజేపీ ఆందోళన విరమణ ఓకే! మరి సోమవారం నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా? కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుందా? ఇన్నాళ్లు నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితి అట్టుడికిపోయింది. ఇప్పటికైతే అంతా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ఇష్యూను ఇంతటితో వదిలిపెట్టేలా లేవు. రాహుల్ గాంధీ తన లేఖలో సంధించిన ప్రశ్నలు, ఇటు ప్రభుత్వం తెస్తున్న సరికొత్త బిల్లు మధ్య.. సోమవారం నుంచి సెషన్స్ ఎలా ఉంటాయన్నది కాస్త ఉత్కంఠగానే ఉంది.

విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
Parliament Session
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2026 | 8:59 PM

Share

దేశ రాజధానిలో చెలరేగిన విద్యార్థుల నిరసన జ్వాలలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇన్నాళ్లూ కుదిపేశాయి. అయితే, మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనను విరమించుకోవడంతో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయనే ఆశిస్తోంది కేంద్రం. కానీ, ఇంతలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్‌లు, సాదా దుస్తుల్లో వచ్చి లాఠీలతో విరుచుకుపడిన వ్యక్తుల తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో సూటిగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రాణాంతక ఆయుధాలు ప్రయోగించడానికి ఎవరు అనుమతించారు అంటూ పలు ప్రశ్నలు సంధించారు. సో, ఈ లేఖను చూస్తుంటే.. సోమవారం నాటి సెషన్స్‌లోనూ ఇదే టాపిక్ ఉండొచ్చని తెలుస్తోంది.

హై-పవర్డ్‌ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు..

ఇదే సమయంలో.. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ మాఫియా భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది. ఈ మేరకు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావులేకుండా పరీక్షా వ్యవస్థలో సాంకేతిక, నిర్మాణాత్మక సంస్కరణల కోసం వివిధ రంగాల నిపుణులతో హై-పవర్డ్‌ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌గా టెక్‌ దిగ్గజం నందన్ నిలేకనినీ నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఇస్రో మాజీ ఛైర్మన్‌ సోమనాథ్, IB మాజీ డైరెక్టర్ తపన్ డేకా, మద్రాస్ IIT డైరెక్టర్ కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణులు అమృత్ లాల్ మీనా ఉన్నారు.

సోమవారం నాడు లోక్‌సభ ముందుకు ‘పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 రాబోతోంది. గత చట్టానికి మెరుగులు దిద్దుతూ తెస్తున్న ఈ సవరణ బిల్లు నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి.

యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ , జేఈఈ, క్యూసెట్ వంటి అన్ని కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు ఇది వర్తిస్తుంది. ప్రశ్నాపత్రాలు లేదా ఆన్సర్ కీలను లీక్ చేయడం, పరీక్షా కేంద్రాలలో ఇతరులకు అనధికారికంగా సహాయం చేయడం, ఓఎంఆర్ షీట్లతో ట్యాంపరింగ్ చేయడం, నకిలీ వెబ్‌సైట్లు లేదా అడ్మిట్ కార్డులను సృష్టించడం వంటి 15 రకాల చర్యలను అక్రమాలుగా ఈ చట్టం పరిధిలోకి తెస్తున్నారు. అయితే.. పరీక్షలు రాసే అభ్యర్థులు, విద్యార్థులను శిక్షల పరిధి నుంచి మినహాయించారు. కేవలం వ్యవస్థీకృత ముఠాలు, అసాంఘిక శక్తులు, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకే ఈ చట్టం వర్తిస్తుంది.

కాపీయింగ్, ప్రాక్సీ అభ్యర్థుల ద్వారా పరీక్షలు రాయించడం వంటి అక్రమాలకు పాల్పడితే ఇప్పటి వరకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేవారు. ఇకపై పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు 50 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలకు పాల్పడే పెద్ద ముఠాలు, లీక్ గ్యాంగ్‌ల నుంచి గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానా వసూలు చేయనున్నారు. అంతేకాదు, కేసు నమోదైన 2 నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల్లోపే తుది తీర్పు వచ్చేలా సత్వర న్యాయం అందించే నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారు. అయితే.. ఈ కీలక బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో ప్రతిపక్షాలు ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలి.

ఒకవైపు హోంమంత్రి జవాబుదారీతనంపై ప్రతిపక్షాల నిలదీత.. మరోవైపు పేపర్ లీక్ ముఠాలపై ఉక్కుపాదం మోపేలా సరికొత్త బిల్లు రూపకల్పన.. ఈ రెండు విభిన్న పరిణామాల నడుమ సోమవారం నాటి పార్లమెంట్ సమావేశాలు కేవలం సజావుగా సాగడమే కాదు, దేశ రాజకీయాల్లో అత్యంత వాడీవేడి చర్చలకు వేదిక కాబోతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us