డీజిల్‌కు ప్రత్యామ్నాయం వచ్చేసింది..! దేశంలో తొలి LNG డ్యూయల్-ఫ్యూయల్ రైలు పరుగులు!
భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి తొలి అడుగు పడింది. సబర్మతిలో దేశంలోనే మొదటి LNG డ్యూయల్-ఫ్యూయల్ రైలు ప్రారంభమైంది. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, ఏడాదికి రూ.25 లక్షల ఇంధన వ్యయం ఆదా చేయడమే లక్ష్యం. ఈ సాంకేతికత రైల్వేకు ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను అందిస్తుంది, సుస్థిర రవాణాకు బాటలు వేస్తుంది.

భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి మరో కీలక అడుగు పడనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోనే తొలి LNG ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. రైల్వే కార్యకలాపాల్లో డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వ్యయాలను నియంత్రించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా డ్రైవింగ్ పవర్ కార్ల (DPCs)లో ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత డ్యూయల్-ఫ్యూయల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ సాంకేతికతతో ఒకే ఇంజన్ LNGతో పాటు డీజిల్‌పైనా పనిచేయగలదు. దీంతో LNG అందుబాటులో ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో డీజిల్‌కు మారే అవకాశం ఉంటుంది.
1,400 హార్స్‌పవర్ సామర్థ్యంతో రెండు DPCలు
ఈ ప్రాజెక్టులో భాగంగా 1,400 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్ పవర్ కార్లను LNG డ్యూయల్-ఫ్యూయల్ సిస్టమ్‌కు అనుగుణంగా మార్చారు. ఈ రెండు DPCలు 2,000 కిలోమీటర్లకు పైగా క్షేత్రస్థాయి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. రోజువారీ నిర్వహణ పరిస్థితుల్లో కొత్త ఇంధన వ్యవస్థ పనితీరు, విశ్వసనీయతను అంచనా వేయడానికి ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంధన లభ్యతను బట్టి LNG, డీజిల్ మధ్య మారేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో LNG సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తినా రైలు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా డీజిల్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.
ఒక్కో DPCపై ఏడాదికి రూ.25 లక్షల ఆదా?
ట్రయల్స్‌లో నమోదైన డేటా ఆధారంగా ఒక్కో DPCపై సంవత్సరానికి సుమారు రూ.25 లక్షల వరకు ఇంధన వ్యయం ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. LNG వినియోగం ద్వారా డీజిల్ అవసరం తగ్గడంతో పాటు ఇంధన దిగుమతులపై ఆధారపడటం కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంది. డీజిల్‌తో పోలిస్తే LNG ధర తక్కువగా ఉండే పరిస్థితుల్లో డ్యూయల్-ఫ్యూయల్ టెక్నాలజీ రైల్వే నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇలాంటి వ్యవస్థల విస్తరణ ద్వారా రైల్వేకు ఇంధన వ్యయాల్లో మరింత ఆదా సాధించే అవకాశం ఉంది.
2,200 లీటర్ల LNG ట్యాంక్
ప్రతి DPCలో సుమారు 2,200 లీటర్ల సామర్థ్యం కలిగిన LNG ట్యాంక్‌ను అమర్చారు. ఇందులో దాదాపు 850 నుంచి 900 కిలోగ్రాముల వరకు ఉపయోగించగల LNGని నిల్వ చేయవచ్చు. సాంప్రదాయ డీజిల్ ఇంజిన్‌కు ఉన్న శక్తి, విశ్వసనీయత, నిర్వహణ సామర్థ్యాలను కొనసాగిస్తూ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
పూర్తి ట్యాంక్‌తో 1,600 కి.మీ. ప్రయాణం
ఒక్కసారి LNG ట్యాంక్‌ను పూర్తిగా నింపితే సుమారు 1,600 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా. దీంతో తరచుగా ఇంధనం నింపాల్సిన అవసరం తగ్గి, రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది. LNG డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికత భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ఒక కొత్త దిశను చూపిస్తోంది. ఇంధన సామర్థ్యం పెంపు, నిర్వహణ వ్యయాల తగ్గింపు, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారకద్రవ్య ఆదా వంటి లక్ష్యాల సాధనలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతికతను మరిన్ని రైల్వే కార్యకలాపాలకు విస్తరించేందుకు భారత రైల్వే ప్రయత్నిస్తోంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
