AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND-W vs PAK-W : ఓడిపోయినా హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్తాన్.. టీమిండియాపై సరికొత్త పవర్‌ప్లే రికార్డ్

IND-W vs PAK-W : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో ఓడిపోయినా పాకిస్తాన్ జట్టు సరికొత్త పవర్‌ప్లే రికార్డు సృష్టించింది. మునీబా అలీ మెరుపులతో 52 పరుగులు నమోదు చేసిన పాక్‌ను దీప్తి శర్మ 5 వికెట్లతో కుప్పకూల్చి భారత్‌కు ఘన విజయం అందించింది.

IND-W vs PAK-W : ఓడిపోయినా హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్తాన్.. టీమిండియాపై సరికొత్త పవర్‌ప్లే రికార్డ్
Pakistan Women
Rakesh
|

Updated on: Jun 15, 2026 | 6:46 AM

Share

IND-W vs PAK-W : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026 ఆరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నిర్దేశించిన 171 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమై 106 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కొని పవర్‌ప్లేలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్‌పై పవర్‌ప్లేలో పాకిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఓపెనర్ మునీబా అలీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. మరో ఓపెనర్ గల్ ఫిరోజాతో కలిసి ఆమె మొదటి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ ప్రమాదకరమైన జోడీని భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ ఐదో ఓవర్లో ఫిరోజాను అవుట్ చేయడం ద్వారా విడదీసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయేషా జాఫర్ కూడా రాగానే భారీ షాట్లు ఆడటంతో పాకిస్తాన్ స్కోరు బోర్డు పవర్‌ప్లేలో వేగంగా దూసుకెళ్లింది.

మునీబా అలీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ జట్టు మొదటి 6 ఓవర్లు ముగిసేసరికి కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 52 పరుగులు సాధించింది. ఉమెన్స్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో టీమిండియాపై పవర్‌ప్లేలో పాకిస్తాన్ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఈ స్కోరు చూసి ఒక దశలో పాకిస్తాన్ గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు.

అయితే, పవర్‌ప్లే ముగిసిన తర్వాత భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరంగా మారుతున్న మునీబా అలీ 41 పరుగుల వద్ద ఉన్నప్పుడు దీప్తి శర్మ వేసిన ఒక అద్భుతమైన డైరెక్ట్ త్రోకు ఆమె రన్ అవుట్ అయింది. 11వ ఓవర్లో మునీబా అవుట్ అవ్వడంతో పాక్ పతనం ప్రారంభమైంది. అప్పటికి పాక్ స్కోరు 4 వికెట్లకు 75 పరుగులు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా డకౌట్ (0) కాగా, నటాలియా పర్వేజ్ కూడా కేవలం 4 పరుగుల తేడాలోనే అవుట్ అయింది. దీనితో పాకిస్తాన్ జట్టు కేవలం 4 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.

చివరి ఓవర్లలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ తన బౌలింగ్ విశ్వరూపం చూపించింది. 17వ ఓవర్లో ఆమె ఏకంగా 3 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను 106 పరుగులకే ముగించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన దీప్తి శర్మ.. కేవలం 10 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు (5-10) పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు, బౌలింగ్‌లో ఫైవ్ వికెట్ హాల్ సాధించి, ఒక కీలక రన్ అవుట్ చేసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పవర్‌ప్లేలో రికార్డులు సృష్టించినా, సరైన మిడిల్ ఆర్డర్ లేకపోవడంతో పాక్ జట్టుకు ఓటమి తప్పలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us