AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీలకర్ర నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు తెలుసుకోండి..

ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే చాలా మంది ఉదయం నిద్రలేవగానే జీరా వాటర్ తాగడాన్ని ఒక మ్యాజిక్ డ్రింక్‌లా భావిస్తుంటారు. డైట్, ఎక్సర్‌సైజ్‌లతో పనిలేకుండా కేవలం ఈ నీటితోనే స్లిమ్‌గా అయిపోవచ్చని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. అసలు జీలకర్ర నీరు శరీరంలో ఎలా పనిచేస్తుంది? దీన్ని తాగడానికి పర్ఫెక్ట్ టైమింగ్ ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జీలకర్ర నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు తెలుసుకోండి..
Does Jeera Water Really Melt Belly Fat
Krishna S
|

Updated on: Jun 15, 2026 | 6:40 AM

Share

బరువు తగ్గాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ జీలకర్ర నీరు గురించి పక్కాగా తెలిసే ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున జీరా వాటర్ తాగితే చాలు.. కొద్ది రోజుల్లోనే బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుందని, పొట్ట ఫ్లాట్‌గా అయిపోతుందంటూ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే కేవలం జీలకర్ర నీరు తాగడం వల్లే బరువు తగ్గుతారా? ఇందులో మెడికల్ సైన్స్ ఏం చెబుతోంది? ఇది నిజమా లేక కేవలం అపోహనా? వైద్య నిపుణుల పరిశోధనల ప్రకారం అసలు వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్పాట్ రిడక్షన్ సాధ్యం కాదు.. జీరా వాటర్ మ్యాజిక్ డ్రింక్ కాదు..

చాలా మంది అనుకుంటున్నట్లుగా కేవలం జీలకర్ర నీరు తాగడం వల్ల మాత్రమే పొట్ట భాగంలో కొవ్వు తగ్గదు. వైద్యపరంగా.. మనం తీసుకునే ఏ ఒక్క పానీయం లేదా మసాలా దినుసు, శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న కొవ్వును మాత్రమే టార్గెట్ చేసి కరిగించలేదు. బరువు తగ్గడానికి ఉన్న ఏకైక శాస్త్రీయ మార్గం క్యాలరీ డెఫిసిట్. అంటే మనం రోజంతా తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. సరైన పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు జీలకర్ర నీటిని ఒక సపోర్టింగ్ డ్రింక్‌గా తీసుకున్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు వస్తాయి తప్ప, డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ లేకుండా ఇది ఎలాంటి మ్యాజిక్ చేయలేదు.

జీరా వాటర్ తాగడానికి పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే..

జీలకర్ర నీటిని సరైన సమయంలో తీసుకోవడం వల్ల శరీరానికి గరిష్ట ప్రయోజనాలు అందుతాయి.

ఉదయం ఖాళీ కడుపుతో: ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని జీలకర్ర నీరు తాగడం వల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు బాడీని డిటాక్స్ చేస్తాయి.

భోజనానికి ముందు: మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి 20-30 నిమిషాల ముందు ఈ నీటిని తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు: హెవీగా తిన్నప్పుడు లేదా కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు జీరా వాటర్ తాగితే, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అమృతం అయినా ఎక్కువైతే విషమే.. సైడ్ ఎఫెక్ట్స్ జాగ్రత్త..

‘కొంచెం తాగడం మంచిదైతే.. ఎక్కువగా తాగితే ఇంకా వేగంగా బరువు తగ్గుతాం కదా.. అని చాలా మంది భావిస్తారు. కానీ ఇది తీవ్రమైన పొరపాటు. జీలకర్ర నీటిని మోతాదుకు మించి ఎక్కువగా తాగడం లేదా చాలా చిక్కటి కషాయంలా కాచుకుని తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడం, గుండెల్లో మంట వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు వైద్యుడిని సంప్రదించకుండా జీలకర్రను ఎక్కువగా తీసుకోకూడదు.

ఇంట్లోనే జీరా వాటర్ ఎలా తయారు చేసుకోవాలి?

  • ఒక టేబుల్ స్పూన్ తాజా జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.
  • ఉదయాన్నే ఆ నీటిని జీలకర్రతో సహా బాగా మరిగించి, వడకట్టాలి.
  • అది గోరువెచ్చగా మారిన తర్వాత తాగాలి. రుచి కోసం కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం లేదా అర చెంచా తేనె కలుపుకోవచ్చు.

జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కానీ బరువు తగ్గడానికి ఇది కేవలం ఒక సహాయకారి మాత్రమే తప్ప పూర్తి పరిష్కారం కాదు. సమతుల్య ఆహారం, హెల్తీ లైఫ్ స్టైల్‌తో పాటు దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటేనే ఆశించిన ఫిట్‌నెస్ మీ సొంతమవుతుంది.

(గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించవలసిందిగా మనవి.)

Follow Us