Summer Health Tips: వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి? నిపుణుల సలహా ఏమిటంటే..
వేసవి కాలం వచ్చేసింది. భానుడు భాగభాగలాడుతున్నాడు. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. దీంతో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ముఖ్యం. వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలను నిపుణులు వెల్లడించారు. వీటిని పాటించడం వలన వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు.

వేసవి వచ్చేసింది. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో తీవ్రమైన ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం చాలా అవసరం. కనుక తినే ఆహారంలో మంచి పదార్థాలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వేడి నుంచి ఉపశమనం ఇచ్చే పదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకోవాలి. వేసవిలో వేడి వాతావరణంతో ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, నిర్జలీకరణం వంటి అనేక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో ఆరోగ్యంగా ఉండడం కోసం అనుసరించాల్సిన కొన్ని నిపుణుల చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
తేలికైన భోజనం తినండి
క్రమం తప్పకుండా భోజనం చేయండి. కార్బోహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఆహారాన్ని తినడం వలన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. కనుక ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండండి. తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. నారింజ, పుచ్చకాయ, టమోటాలు వంటి వాటిని తినడం వలన శరీర ఆరోగ్యానికి మంచిది.
ఎండ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి
బలమైన సూర్యకాంతి ఎక్కువసేపు చర్మానికి తగలడం వలన చర్మ సంబంధిత అనేక సమస్యలు వస్తాయి. కనుక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి మీరు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. ఎండ ఎక్కువగా తగడలడం వల్ల వాపు, మంట లేదా మరేదైనా చర్మ సమస్య రావచ్చు.
ఎక్కువ నీళ్లు తాగండి
మండే వేడి, చెమట కారణంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగండి. ఐస్డ్ టీ, హెర్బల్ టీ, ప్లెయిన్ వాటర్, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ, దోసకాయ వంటి పానీయాలు త్రాగాలి.
తగినంత విశ్రాంతి, నిద్ర
వేసవి సీజన్ లో త్వరగా అలసిపోతారు. అలసట నుంచి ఉపశమనం కోసం తగినంత విశ్రాంతి అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి సమయంలో 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. రాత్రి సమయంలో తినే భోజనం.. తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిద్ర పోయే సమయంలో ఎటువంటి సమస్య కలగదు.
వ్యాయామం:
వేసవిలో ఉదయం నిద్రలేవడం శీతాకాలంలో ఉన్నంత కష్టం కాదు. అటువంటి పరిస్థితిలో.. ఉదయాన్నే నిద్రలేచి యోగా, వ్యాయామం చేయండి. ఇలా చేయడం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)