ఎండాకాలంలో జుట్టుకు రోజూ షాంపూ పెడితే ఏమవుతుంది..? ఫస్ట్ ఈ నిజాలు తెలుసుకోండి..
భానుడి భగభగలకు కేవలం చర్మమే కాదు, మన కేశాలూ విలవిల్లాడుతున్నాయి. బయట అడుగుపెడితే చాలు, ముంచెత్తే చెమటతో తలంతా జిడ్డుగా మారుతోంది. ఈ క్రమంలో జుట్టును రోజూ కడగాలా? లేక అలా వదిలేయాలా? అనే అయోమయం అందరిలోనూ నెలకొంది. అసలు వేసవిలో మన జుట్టు సంరక్షణ ఎలా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండలు ముదురుతున్నాయి. బయట అడుగుపెడితే చాలు చెమటతో తలంతా జిడ్డుగా, చిరాకుగా మారుతోంది. దీంతో ప్రతిరోజు లస్నానం చేయాలని అనుకుంటారు. అయితే, అందరికీ ఒకే రకమైన పద్ధతి పనికిరాదని, జుట్టు రకాన్ని బట్టి సంరక్షణ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా మీ జుట్టు ఏ రకానికి చెందినదో గుర్తించడం ముఖ్యం. మీకు సన్నని లేదా నిటారుగా ఉండే జుట్టు ఉంటే, చెమట, నూనె త్వరగా జుట్టు చివర్ల వరకు పాకుతాయి. దీనివల్ల జుట్టు త్వరగా జిడ్డుగా కనిపిస్తుంది. ఇలాంటి వారు జుట్టు కుదుళ్లు మూసుకుపోకుండా ఉండటానికి ప్రతిరోజూ లేదా ఒక రోజు విడిచి ఒక రోజు తలస్నానం చేయడం మంచిది. దీనివల్ల జుట్టు శుభ్రంగా ఉంటుంది.
ఉంగరాల జుట్టు లేదా సాధారణ జుట్టు ఉన్నవారికి కాస్త వెసులుబాటు ఉంటుంది. వీరు వారానికి రెండు లేదా మూడు సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. ఇది జుట్టులోని సహజ సిద్ధమైన నూనెలను తొలగించకుండా.. పేరుకుపోయిన మురికిని వదిలిస్తుంది. అదేవిధంగా మీ జుట్టు చాలా దట్టంగా లేదా గరుకుగా ఉంటే అసలు షాంపూని ఎక్కువగా వాడకూడదు. ఈ రకమైన జుట్టుకు తేమ చాలా అవసరం. వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి కడిగితే సరిపోతుంది. లేదంటే జుట్టు బాగా పొడిబారిపోయి చిక్కుబడిపోతుంది.
చాలా మందిలో ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే.. చుండ్రు ఉంటే జుట్టును తక్కువగా కడగాలని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది తప్పు. తల చర్మంపై చెమట, నూనె పేరుకుపోవడం వల్ల చుండ్రును కలిగించే బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుగుతుంది. దీనివల్ల దురద, వాపు వచ్చి జుట్టు ఎక్కువగా రాలుతుంది. చుండ్రు సమస్య ఉన్నవారు వేసవిలో వారానికి కనీసం మూడు నుండి నాలుగు సార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టును కాపాడుకోవచ్చు.
మీరు వ్యాయామం లేదా స్విమ్మింగ్ చేసేవారైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజూ జిమ్‌లో కష్టపడి వ్యాయామం చేసి చెమట పట్టినప్పుడు ప్రతిసారీ షాంపూ వాడాల్సిన అవసరం లేదు. కేవలం మంచి నీటితో తలని మసాజ్ చేస్తూ కడిగితే చెమట వెళ్ళిపోతుంది. అలాగే స్విమ్మింగ్ పూల్‌లోని క్లోరిన్ నీరు జుట్టును పాడు చేస్తుంది కాబట్టి ఈత కొట్టిన వెంటనే ఖచ్చితంగా మంచి నీటితో స్నానం చేసి కండిషనర్ వాడాలి. మీ జుట్టు అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడమే ఆరోగ్యకరమైన జుట్టుకు రహస్యం.
