Mahabali Frog: సృష్టిలో చిత్రం ఈ మహాబలి కప్ప.. ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనం.. మిస్టరీ కప్ప గురించి మీకు తెలుసా..
ఏడాదికి ఒకసారి భూమి మీదకు వచ్చి తన పని నిర్వహించి మళ్ళీ భూగర్భంలో నివసించడానికి వెళ్ళిపోతుంది. ఈ జీవిని ఊదా రంగు కప్ప లేదా మహాబలి కప్ప అంటారు. ఇది వర్షాకాలంలో ఒకసారి మాత్రమే నేలమీదకు వస్తుంది. అయితే ఈ కప్పు ఏడాది పొడవున్నా ఎక్కడ ఉంటుంది? ఈ సమయంలో అది ఎందుకు పైకి వస్తుంది? ఇది ఇతర కప్పల కంటే ఈ మహాబలి కప్పు ఎందుకు భిన్నం ఈ రోజు తెలుసుకుందాం

ప్రకృతిలో జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతిరోజూ మన ఊహకు అందని ఎన్నో సంఘటనలు మన చుట్టూ జరుగుతాయి. ఇటు వంటి వింత సంఘటనలకు వేదికగా సైన్స్ కి సవాల్ చేసే ఒక సంఘటన పశ్చిమ కనుమల చుట్టూ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఊదా కప్ప లేదా మహాబలి కప్ప అని పిలువబడే ఒక రకమైన కప్ప సంవత్సరానికి ఒకసారి మాత్రమే భూమిపైకి వస్తుంది. సాధారణంగా, ప్రతి సంవత్సరం ఓనం ప్రారంభానికి ముందు కేరళలో కనిపిస్తాయి.. అది శుభ సంకేతంగా భావిస్తారు అక్కడ ప్రజలు. ఇది వర్షాకాలంలో ఒకసారి మాత్రమే భూమి మీదకు వచ్చి దర్శనం ఇస్తుంది ! అయితే మిగిలిన సమయం ఈ కప్పు ఎక్కడ ఉంది? ఈ సమయంలో అది ఎందుకు పైకి వస్తుంది? ఇది ఇతర కప్పల కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ రోజు తెలుసుకుందాం..
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అంతరించిపోతున్న మహాబలి లేదా ఊదా కప్ప వర్షాకాలంలో సంవత్సరానికి ఒకసారి అది కూడా సంతానోత్పత్తి కోసం భూమి ఉపరితలంపైకి వస్తుంది. మగ కప్పలు వాటి బొరియల నుంచి బయటకు వచ్చి ఆడ కప్పలను వెతుకుతాయి. మగ కప్పల కంటే ఆడ కప్పలు మూడు రెట్లు పెద్దవి, పండిన వంకాయల రంగులో ఉంటాయి. తరువాత అవి జతకట్టి వేల గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత.. అవి భూమి లోపల ఉన్న బోరియల్లోకి తిరిగి వెళ్ళిపోతాయి. ఈ కప్పలు సాధారణంగా పశ్చిమ కనుమల వెచ్చని ప్రాంతాలలో నివసిస్తాయని చెబుతారు. ఈ కప్పలు సంవత్సరంలో 364 రోజులు భూగర్భంలో ఉంటాయి. వీటిని ఎవరూ చూడలేరు. ఎందుకంటే వర్షాలు పడటం ప్రారంభించిన తర్వాత ఒక్కసారి మాత్రమే నేల మీదకు వస్తాయి.
మహాబలి కప్పలు ఎలా ఉంటాయి?
ఈ కప్పల వెనుక కాళ్ళు పొట్టిగా ఉంటాయి. అందువలన ఈ కప్పు అన్ని కప్పల మాదిరిగా దూకదు. దీని శరీరం దాదాపు ఏడు సెంటీమీటర్ల పొడవు, చిన్న కాళ్ళు కలిగి, ముదురు రంగులో ఉంటుంది. ఇది కొద్దిగా ఉబ్బినట్లు కనిపిస్తుంది. దీని ముక్కు కోణం ఆకారంలో ఉంటుంది. దీంతో దీనిని పిగ్-నోస్డ్ ఫ్రాగ్ అని కూడా పిలుస్తారు. మందపాటి కండరాలతో కూడిన చిన్న కాళ్ళు, చేతులు మట్టిని తవ్వడానికి సహాయపడతాయి.
మహాబలి కప్పలు ఎందుకు తరచుగా కనిపించవంటే
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్ దీనిని అంతరించిపోతున్న జాతిగా గుర్తించి.. ఆ లిస్టు లో చేర్చింది. ఈ కప్పలు నదులు, వాగుల దగ్గర నేలలో నివసిస్తాయి. వానపాములు, చెదపురుగులు, చీమలు, చిన్న కీటకాలను తింటాయి. అటవీ శాఖ సిఫార్సు ప్రకారం మహాబలి కప్పను కేరళ రాష్ట్ర అధికారిక కప్పగా ప్రకటించడానికి చర్యలు తీసుకున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన జాతి. నైరుతి కనుమలలోని ఈ ప్రాంతానికి చెందినది. మరెక్కడా కనిపించదు. ఇది మొదట 2003లో కేరళ అడవులలో కనుగొనబడింది. అటవీ నిర్మూలన, అటవీ భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం, మానవులు జంతువుల ఆవాసాలను ఆక్రమించడం వల్ల ఈ కప్పలు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. ఇవి వేల సంఖ్యలో గుడ్లు పెట్టినప్పటికీ.. ఆ గుడ్లలో ఎన్ని కప్పలుగా జన్మిస్తాయో.. వాటిలో ఎన్ని మనుగడ సాగిస్తాయో, గాలి, వర్షం లేదా ఇతర జంతువులు ఎన్ని తింటాయో తెలియదు. కనుక ఈ మహాబలి కప్పల సంఖ్య తరిగిపోతూ అంతరించిపోతున్న జాతిలోకి చేరుకుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)