అబ్రకదబ్ర.. నల్లకోడా మజాకా.. ఈ మాంసం తిన్నారంటే రోగాలన్నీ మాటాష్..
ఒకప్పుడు మధ్యప్రదేశ్ అడవీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కడక్‌నాథ్ కోడి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భలే గిరాకీ తెచ్చుకుంటోంది. నల్లని రంగు చూసి ఆశ్చర్యపోయినా.. దాని మాంసం రుచి వెరి స్పెషల్.. తింటే మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే అంటున్నారు వ్యాపారులు.. ఈ మాంసాన్ని చాలా మంది ఇష్టంగా కొని వండుకుంటారు.. దీని స్పెషాలిటీ ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్లు, తక్కువ కొలెస్ట్రాల్‌తో.. కడక్‌నాథ్ కోడి మాంసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాయిలర్ కోడితో పోలిస్తే ఇందులో పోషక విలువలు అధికంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారతదేశానికి చెందిన స్వదేశీ నాటు కోడి జాతి కడక్‌నాథ్. దీని స్వస్థలం మధ్యప్రదేశ్. అక్కడి గిరిజనులు దీనిని ‘కాలి–మాసి’, ‘కాలామాళి’గా పిలుస్తారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ కోడి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఈ కోడిపై రైతులు, వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. అంతరించిపోతున్న నాటు కోడి జాతులకు ప్రత్యామ్నాయంగా కడక్‌నాథ్‌ను పెంచవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
నల్లని రూపమే దీని ప్రత్యేక గుర్తింపు..
కడక్‌నాథ్ కోళ్లలో ఈకలు, చర్మం మాత్రమే కాదు.. మాంసం, ఎముకలు, రక్తం కూడా నల్లగానే ఉంటాయి. ముదురు నలుపు, నీలం వర్ణాల్లో కనిపించే ఈ కోళ్లను ‘జెట్ బ్లాక్’ రకంగా గుర్తిస్తారు. కోడి పిల్లలు పుట్టినప్పటి నుంచే నీలం,నలుపు రంగుల్లో ఉండి వీపు మీద ముదురు గీతలతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ధర ఎక్కువైనా.. డిమాండ్ తగ్గకపోవడానికి కారణం ఇదే..
ప్రస్తుతం కడక్‌నాథ్ కోడి మాంసం కిలో ధర రూ.800 నుంచి రూ.900 వరకు పలుకుతోంది. ఒక్కో కోడి పిల్ల ధర రూ.65 నుంచి రూ.70 వరకు ఉండగా, గుడ్డు ఒక్కటికి రూ.40–45 వరకు విక్రయమవుతోంది. ధరలు ఎక్కువగా ఉన్నా వినియోగదారులు వెనుకడుగు వేయకపోవడానికి కారణం ఈ కోడి మాంసంలో ఉన్న అపారమైన పోషక, ఔషధ గుణాలే.
ఆరోగ్యానికి అపూర్వమైన నల్లని మాంసం..
కడక్‌నాథ్ కోడి మాంసంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండటంతో మాంసం నల్లగా ఉంటుంది. రూపం భిన్నంగా ఉన్నా, పోషక విలువల్లో మాత్రం ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ మాంసంలో సుమారు 25 శాతం ప్రోటీన్లు, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. బాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే ఇందులో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ.
ఇందులో 18 రకాల అమైనో ఆమ్లాలు, విటమిన్లు (B1, B2, B3, B12), కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ మాంసం కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
రైతుకు లాభం… గ్రామీణ ఆర్థికానికి బలం..
కడక్‌నాథ్ కోళ్లకు సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఆరు నెలల వయసు నుంచే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాది కాలంలో సగటున 90 నుంచి 100 గుడ్లు పెడతాయి. అయితే ఏడునెలల వయసులో వీటి బరువు సుమారు 1.5 కిలోల వరకు మాత్రమే పెరుగుతుంది.
తక్కువ పెట్టుబడి, అధిక లాభాల కారణంగా కడక్‌నాథ్ కోడి పెంపకం ఇప్పుడు గ్రామీణ రైతులకు కొత్త ఆశగా మారుతోంది. నల్లని మాంసం వెనుక దాగి ఉన్న ఈ విలువైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
