AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా జస్ట్ ఇలా చేస్తే చాలు.. మురికి బకెట్లు తళతళ మెరవాల్సిందే..

బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉన్నా, అక్కడ వాడే బకెట్లు, మగ్గులు మురికిగా ఉంటే ఆ అందమంతా పోతుంది. నీటిలోని ఉప్పు శాతం వల్ల కొద్దిరోజులకే ప్లాస్టిక్ బకెట్లపై పసుపు రంగు మొండి మరకలు పేరుకుపోతాయి. వీటిని వదిలించడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్ వాడినా ఫలితం ఉండదు.. మరి రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో దొరికే వస్తువులతోనే పాత బకెట్లను కొత్తవాటిలా మెరిపించొచ్చు..

పైసా ఖర్చు లేకుండా జస్ట్ ఇలా చేస్తే చాలు.. మురికి బకెట్లు తళతళ మెరవాల్సిందే..
How To Clean Plastic BucketsImage Credit source: Pinterest
Krishna S
|

Updated on: May 04, 2026 | 11:46 AM

Share

సాధారణంగా ప్రతి ఇంట్లో బాత్రూం క్లీనింగ్‌పై ఉన్న శ్రద్ధ, అక్కడ వాడే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గుల మీద ఉండదు. నీటిలోని లవణాలు, నిరంతర వాడకం, సబ్బు నురుగు పేరుకుపోవడం వల్ల కొద్దిరోజులకే ప్లాస్టిక్ వస్తువుల మెరుపు తగ్గిపోతుంది. వాటిపై పసుపు లేదా తెల్లటి మొండి మరకలు ఏర్పడతాయి. ఇవి చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం కూడా ఉంది. చాలామంది వీటిని శుభ్రం చేయలేక పారేసి కొత్తవి కొంటుంటారు. కానీ మన వంటింట్లో దొరికే వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా వీటిని ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా – వెనిగర్

బకెట్‌పై దశాబ్దాల కాలం నాటి మురికి ఉన్నా సరే, బేకింగ్ సోడా మరియు వెనిగర్ మిశ్రమం దానిని వదిలిస్తుంది. ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకోండి. అందులో అర కప్పు వెనిగర్ కలపండి. ఈ రెండు కలిసినప్పుడు వచ్చే నురుగును బకెట్ లోపల, బయట ఎక్కడైతే మురికి ఎక్కువగా ఉందో అక్కడ పట్టించండి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో రుద్ది నీటితో కడిగేయండి. బకెట్ తళతళలాడిపోతుంది.

నిమ్మకాయ – ఉప్పు: సహజసిద్ధమైన బ్లీచింగ్

ప్లాస్టిక్ వస్తువులకు సహజమైన మెరుపును తీసుకురావడంలో నిమ్మకాయ సాటిలేనిది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ పసుపు మరకలను సులభంగా కరిగిస్తుంది. బకెట్‌ను కొద్దిగా తడిపి, దానిపై సాదా ఉప్పును చల్లండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, ఆ ముక్కలతో ఉప్పుపై ఒత్తిడి పెంచుతూ రుద్దండి. ఇది కేవలం మురికిని వదలగొట్టడమే కాకుండా, బకెట్‌కు ఉన్న బ్యాడ్ స్మెల్‌ను పోగొట్టి మంచి సువాసనను ఇస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్: తెల్లటి మరకలకు చెక్

మీ బకెట్ మీద తెల్లటి సున్నం లాంటి మరకలు ఎక్కువగా ఉంటే, హైడ్రోజన్ పెరాక్సైడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కాటన్ క్లాత్‌ను హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో ముంచి, బకెట్ అంతా తుడవండి. ఒక 30 నిమిషాల తర్వాత సోపు నీటితో కడిగేయండి. ఇది క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది.

డిటర్జెంట్ – వేడి నీరు

రుద్దే ఓపిక లేని వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఒక పెద్ద పాత్రలో నీటిని వేడి చేయండి. ఆ నీటిని బకెట్‌లో నింపి, రెండు స్పూన్ల వాషింగ్ పౌడర్ కలపండి. వీలైతే ఇందులో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కూడా వేయవచ్చు. ఒక గంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత మామూలుగా కడిగేస్తే మురికి దానంతట అదే వదిలిపోతుంది.

బకెట్లు ఎక్కువ కాలం మెరవాలంటే ఇలా చేయండి

ప్రతిరోజూ కడగండి: బాత్రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు బకెట్‌లో మిగిలిన నీటిని పారబోసి, ఒక్కసారి మంచి నీటితో కడిగి బోర్లించడం వల్ల పాచి పట్టకుండా ఉంటుంది.

ఎండలో పెట్టకండి: ప్లాస్టిక్ బకెట్లను ఎక్కువసేపు ఎండలో ఉంచితే అవి రంగు వెలిసిపోవడమే కాకుండా, పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి.

నెలకు ఒకసారి డీప్ క్లీనింగ్: పైన చెప్పిన చిట్కాల్లో ఏదో ఒకటి ఎంచుకుని నెలకు ఒకసారి క్లీన్ చేస్తే, మీ బకెట్లు ఎప్పుడూ కొత్త వాటిలాగే ఉంటాయి.

Follow Us