ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి..? చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే ఈ తప్పులు చేయొద్దు..
మీ ఇంట్లో నెలకు ఎన్ని లీటర్ల నూనె ఖర్చవుతోంది? 4 లీటర్లా.. లేక అంతకంటే ఎక్కువా? అయితే మీ గుండె డేంజర్ జోన్‌లో ఉన్నట్లే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మనిషి రోజుకు ఎన్ని స్పూన్ల నూనె మాత్రమే వాడాలి? రిఫైన్డ్ ఆయిల్స్‌తో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గజిందర్ కుమార్ గోయల్ వెల్లడించిన కీలక విషయాలు తెలుసుకుందాం.

భారతీయ వంటకాలంటేనే ఘుమఘుమలాడే మసాలాలు, నోరూరించే రుచులు. కూరలకు తాలింపు పెట్టాలన్నా, వేడివేడిగా పకోడీలు వేయించాలన్నా, పరాటాలు కాల్చాలన్నా నూనె లేనిదే వంటగది నడవదు. అయితే రుచిని పెంచే ఈ నూనెనే మితిమీరి వాడితే గుండె ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి నూనె వాడుతున్నామనే దానికంటే.. ప్రతిరోజూ ఎంత మోతాదులో తీసుకుంటున్నామనేది అత్యంత కీలకమని స్పష్టం చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ ప్రోగ్రామ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ గజిందర్ కుమార్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తయినా రోజుకు 15 నుంచి 20 మిల్లీలీటర్ల (సుమారు 3 నుంచి 4 టీస్పూన్లు) కంటే ఎక్కువ నూనె వాడకూడదు. ఈ లెక్కన వారానికి 105 నుంచి 140 మి.లీ, ఒక వ్యక్తికి నెలకు 500 నుంచి 600 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. నలుగురు సభ్యులున్న సగటు కుటుంబానికి నెలకు 2 లీటర్ల నూనె సరిపోతుందని, కానీ చాలా భారతీయ కుటుంబాల్లో ఐదుగురికి కలిపి నెలకు ఏకంగా 5 నుంచి 10 కేజీల నూనె వాడుతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు.
గుండెకు ఏ నూనె మేలు చేస్తుంది?
మార్కెట్లో లభించే రకరకాల నూనెలలో ఆవాల నూనె, సన్‌ఫ్లవర్ నూనె, ఆలివ్ నూనెలు గుండె ఆరోగ్యానికి సాపేక్షంగా మెరుగైన ఎంపికలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను పదిలంగా ఉంచుతాయి. ముఖ్యంగా గానుగ పద్ధతిలో తీసిన ఆవ నూనె భారతీయ వంటకాలకు అత్యంత మంచిది. దీని స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక వేడిలోనూ పాడవకుండా పోషకాలు నిలిచి ఉంటాయి. అయితే ఆలివ్ నూనెను కేవలం సలాడ్లు లేదా తక్కువ మంటపై వండే ఆహారాలకే వాడాలని, డీప్ ఫ్రైయింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
రిఫైన్డ్ ఆయిల్‌తో చేటు.. అధిక వాడకంతో నష్టాలు
రిఫైన్డ్ నూనెలను అధిక ఉష్ణోగ్రతలు, రసాయన పద్ధతుల్లో తయారు చేయడం వల్ల శరీరానికి హాని చేసే సమ్మేళనాలు ఉత్పన్నమవుతాయి. వీటిని నిత్యం వాడితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ప్రతిరోజూ బాగా వేయించిన డీప్ ఫ్రై ఆహారాలు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం, మధుమేహం, ఇన్ఫ్లమేషన్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
గుండె జబ్బులు ఉన్నవారు ఏం చేయాలి?
ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్నవారు నూనె వాడకంలో అత్యంత కఠినమైన జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి వారు నెలకు 750 మిల్లీలీటర్లకు మించి నూనె వాడకూడదు. పోషకాలు, రుచి సమతుల్యం కోసం వంటకాల్లో 80 శాతం ఆవ నూనె, మిగిలిన 20 శాతం సహజమైన నెయ్యి లేదా వెన్న మిశ్రమాన్ని మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో మితంగా తీసుకోవచ్చని డాక్టర్ గోయల్ సూచించారు. సరైన నూనెను ఎంచుకోవడంతో పాటు, దాని పరిమాణాన్ని కచ్చితంగా నియంత్రించుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి మార్గమని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
