Holi 2025: హోలీకి రెడీ అవుతున్నారా.. ఇంట్లోనే సహజ రంగులను సిద్ధం చేసుకోండి.. తయారీ
రంగుల పండుగ హోలీని అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వివిధ రకాల రంగులను ఉపయోగిస్తారు. మార్కెట్లో అనేక రంగులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రంగులు రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో సహజ రంగులను తయారు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు, గులాల్ విసురుకుంటారు. వివిధ రకాల ఆహరాన్ని తింటారు. ఈ రోజు ఆనందానికి, సామరస్యానికి చిహ్నం. ముఖ్యంగా పిల్లలు, యువత హోలీ ఆడటం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. పిల్లలు చాలా రోజుల ముందు నుంచే బెలూన్లు, వాటర్ గన్లు , రంగులను పోగు చేసి హోలీని ఆడడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. వీటిని రసాయనాలతో తయారు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రంగులు చర్మానికి , ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కనుక హోలీని సహజమైన హెర్బల్ రంగులతో మాత్రమే ఆడాలి. వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
బీట్‌రూట్ బీట్‌రూట్ ను ఉపయోగించి ఇంట్లోనే ముదురు ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ముందుగా బీట్‌రూట్‌ను కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి తురుముకోవాలి. తరువాత దాని రసాన్ని తీసి కాటన్ గుడ్డలో చుట్టి ఎండలో ఆరబెట్టాలి. అది ఆరిన తర్వాత.. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే సహజమైన ఎరుపు రంగు సిద్ధమైనట్లే.
పాలకూర: ఈ ఆకు కూరతో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. ముందుగా పాలకూర ఆకులను బాగా కడిగి మరిగించాలి. మరిగిన తర్వాత పాలకూర ఆకులను బాగా ఎండబెట్టి.. అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే పచ్చని రంగు రెడీ.
క్యారెట్: క్యారెట్ తో నారింజ రంగును రెడీ చేసుకోవచ్చు. ఈ రంగుని తయారు చేయడం చాలా సులభం. ముందు క్యారెట్లను శుభ్రం చేసి.. తర్వాత వాటిని బాగా తురుముకోవాలి. రసం తీసి.. మిగిన దానిని ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత క్యారెట్ పీల్ ను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అంతే నేచరాల్ నారింజ రంగు రెడీ అయినట్లే..
పసుపు: పసుపు సహజంగా పసుపు రంగులో ఉంటుంది. యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక హోలీ నాడు పసుపు రంగు గా పసుపును ఉపయోగించవచ్చు. పసుపు తీసుకొని బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి.
గులాబీ రేకులు: ఇంట్లో గులాబీ రేకులను ఉపయోగించి సహజ రంగులను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో సహజమైన రంగులను తయారు చేయడం చాలా సులభం. తాజా గులాబీ రేకులను బాగా కడిగి ఆరబెట్టండి. తరువాత రేకులను మెత్తగా గ్రైండ్ చేసి వాటి పొడిగా తయారు చేయండి. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడానికి ఈ గులాబీ పొడిని ఉపయోగించవచ్చు.
బంతి పువ్వులు: బంతి పువ్వులు పసుపు, నారింజ రంగులలో ఉంటాయి. బంతి పువ్వులను రేకులుగా విడగొట్టి.. వాటి రేకులను నీళ్లలో వేసి కడగాలి. తర్వాత ఆ రేకులను ఎండబెట్టి.. తర్వాత మిక్సి లో వేసి మెత్తని పొడిగా చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..