Black Pepper Milk: రాత్రి నిద్రకు ముందు పాలల్లో నల్ల మిరియాల పొడి కలిపి తాగారంటే..!
నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో చిన్న వయసులోనే వివిధ వ్యాధులు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. కానీ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, పదే పదే ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే..

రాత్రి పడుకునే ముందు నల్ల మిరియాలు కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలల్లో నల్ల మిరియాల పొడి జోడిస్తే, దాని ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
ముఖ్యంగా నల్ల మిరియాలు కలిపిన పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎముకలను కూడా బలపరుస్తుంది. పాలలో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. అదనంగా, నల్ల మిరియాలు పాలలో ఉండే పోషక విలువలను మరింత పెంచుతాయి. ఫలితంగా ఎముకలు బలంగా మారుతాయి. నల్ల మిరియాలలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. మిరియాలు పాలలో కలిపి తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదనంగా నల్ల మిరియాలు శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, శ్లేష్మం తగ్గించడంలో సహాయపడతాయి. గోరువెచ్చని పాలలో మిరియాలు కలిపి తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం సమస్య తొలగిపోతుంది.
నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రాత్రిపూట పాలలో నల్ల మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే నల్ల మిరియాలు కలిపిన పాలు తాగవచ్చు. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
నల్ల మిరియాలు-పాలు ఎలా తయారు చేసుకోవాలంటే?
నల్ల మిరియాల పాలు తయారు చేయడానికి.. ముందుగా గ్లాసు పాలను మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. దానికి చిటికెడు నల్ల మిరియాల పొడి కలపాలి. బాగా కలిపి 2-3 నిమిషాలు మరిగించాలి. ఇలా చేయడం ద్వారా నల్ల మిరియాలలోని పోషక విలువలు పాలలోకి శోషించబడతాయి. ఈ మిశ్రమంలో చిటికెడు పసుపును కూడా జోడించవచ్చు. తర్వాత దాన్ని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. మంచి నిద్ర వస్తుంది. అయితే అలెర్జీలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే దీనిని వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








