Fake Chilly Powder: మీరు వంటల్లో వాడే కారం పొడి అసలైనదేనా? సింపుల్‌గా ఇలా టెస్ట్ చేయండి..
మార్కెట్లో రకరకాల కారం పొడులు లభ్యమవుతున్నాయి. కొందరు అధిక లాభాల కోసం కల్తీ కారం పొడులు విక్రయిస్తున్నారు. వీటిని ఆహారంలో వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కల్తీ కారం వంటకానికి ఆకర్షణీయమైన రంగును ఇస్తుంది. ఘాటు కూడా సాధారణ కారం కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన కారం పొడి..
Updated on: Feb 23, 2025 | 1:12 PM

వంటలో అత్యంత సాధారణంగా ఉపయోగించే పదార్ధాలలో మిర్చీ కారం పొడి ఒకటి. కారం పొడి వేయడం వల్ల వంటకం రుచిగా, ఘాటుగా ఉంటుంది. అయితే మార్కెట్లో రకరకాల కారం పొడులు లభ్యమవుతున్నాయి. కొందరు అధిక లాభాల కోసం కల్తీ కారం పొడులు విక్రయిస్తున్నారు. వీటిని ఆహారంలో వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కల్తీ కారం వంటకానికి ఆకర్షణీయమైన రంగును జోడిస్తుంది. ఘాటు కూడా సాధారణ కారం కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన కారం పొడి అసలైనదా లేదా నకిలీదా అని ఇంట్లో కొన్ని పరీక్షలు చేయడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా, ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి కలపాలి. ఇప్పుడు కారం పొడిని చెంచాతో కదిలించాలి. తర్వాత నీటిలోని గ్లాసు అడుగుభాగానికి కారం పొడి ఆటోమేటిక్‌గా వెళ్తుంది. ఇప్పుడు నీటి అడుగు భాగానికి చేరిన కారం పొడిని మీ అరచేతిలో తీసుకొని తేలికగా రుద్దాలి. అది గరుకుగా ఉంటే, అందులో ఇటుక పొడి కలిపినట్లే.

నానబెట్టిన కారం పొడి చాలా మృదువుగా, ముట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. కానీ గరుకుగా ఉంటే దానికి సబ్బు పొడి కలిపి కల్తీ చేశారని అర్థం. స్వచ్ఛమైన ఎర్ర కారం పొడిని గుర్తించడానికి, దానిని నీటితో కలిపి చెక్ చేయవచ్చు. నిజమైన ఎర్ర మిరపకాయ పొడి నీటిపై తేలుతుంది. పైకి తేలకుండా నీటిలో మునిగిపోతే, అది నకిలీ కారం పొడి అని అర్థం.

అలాగే కల్తీ కారం గుర్తించడానికి, మిరప పొడికి కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ లేదా అయోడిన్ ద్రావణాన్ని జోడించాలి. అయోడిన్ చుక్కలను కలిపిన తర్వాత కారం పొడి నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం.




