ఇవి తింటే చాలు.. చలికాలంలో బరువు పెరగడం అనే మాటే ఉండదు..
Weight Loss: చలికాలంలో పెరిగే ఆకలి బరువు పెరుగుదలకు దారితీస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక ఆహారాలతో దీన్ని నివారించవచ్చు. క్యారెట్లు, బీట్‌రూట్ వంటి దుంపలు, సిట్రస్ పండ్ల రసాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు ఆకలిని తగ్గిస్తాయి. చిలగడదుంప, అవకాడో వంటివి బరువును అదుపులో ఉంచుతూ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

చలికాలం వచ్చిందంటే చాలు.. మన జీవక్రియలో వచ్చే మార్పుల వల్ల ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనివల్ల తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుని బరువు పెరుగుతుంటాము. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మన రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు బరువును అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
భూమిలో పండే దుంపలు
క్యారెట్లు, బీట్‌రూట్ వంటి రూట్ వెజిటేబుల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపిక. వీటిని సలాడ్స్ లేదా కూరల రూపంలో ప్రతిరోజూ తీసుకోవచ్చు.
రోగనిరోధక శక్తినిచ్చే జ్యూస్‌లు
చలికాలంలో క్యారెట్, సిట్రస్ పండ్ల రసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సరైన జీర్ణక్రియ బరువు తగ్గడానికి తొలి మెట్టు.
గింజలు – విత్తనాలు
బాదం, పిస్తా, వాల్‌నట్‌లతో పాటు గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు పోషకాల గనులు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఫలితంగా అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది.
అవకాడో గుండెకు మేలు.. బరువుకు చెక్
అవకాడోలో గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే వీటిని అతిగా తీసుకోకుండా పరిమితంగా తినడం ముఖ్యం.
వేరుశనగలు
వేరుశనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిలో క్యాలరీలు కూడా అధికమే. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని గుప్పెడుకు మించి తినకూడదు. ఎక్కువగా తింటే బరువు తగ్గే బదులు పెరిగే అవకాశం ఉంది.
చిలగడదుంప
ఫైబర్ అధికంగా ఉండే చిలగడదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇది తీపి కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉడకబెట్టిన చిలగడదుంపలను స్నాక్స్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
చలికాలంలో బరువు పెరగడం సహజమే అయినా సరైన ఆహార నియమాలతో దానిని అడ్డుకోవచ్చు. ఈ ఆహారాలతో పాటు తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చలికాలంలో కూడా మీరు ఫిట్‌గా ఉండవచ్చు.
(Note: ఇవి నిపుణుల సూచనలతో పాటు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఏమైన ఆరోగ్యసమస్యలు లేదా పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




