కర్రీలో కరివేపాకు వేసేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?
మనం చేసే ప్రతి వంటకంలో కరివేపాకు ఒక భాగం. దీని సువాసన, రుచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనకు తెలుసు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరివేపాకే మన ఆరోగ్యానికి శత్రువుగా మారుతుందని మీకు తెలుసా..? ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, లో-షుగర్ ఉన్నవారు కరివేపాకు విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో.. వైద్యులు చెబుతున్న వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన వంటింట్లో కరివేపాకు లేని తాలింపు ఉండదు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి, కంటి చూపుకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికి అమృతం లాంటి కరివేపాకు కూడా అందరికీ మంచిది కాదని మీకు తెలుసా..? కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరివేపాకును అధికంగా తీసుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
లో-షుగర్
కరివేపాకు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసినప్పటికీ, ఇప్పటికే రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారు దీనిని అధికంగా తింటే హైపోగ్లైసీమియా బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల తల తిరగడం, నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలర్జీ సమస్యలు
కొంతమందికి కొన్ని రకాల ఆకులు లేదా సుగంధ ద్రవ్యాల వల్ల అలర్జీ ఉంటుంది. కరివేపాకు తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు రావడం, వాపు రావడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే దానిని తినడం ఆపివేయాలి.
గర్భిణీలు – పాలిచ్చే తల్లులు
గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులలో హార్మోన్ల మార్పులు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో కరివేపాకు రసం లేదా పొడిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, జీర్ణక్రియలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీలు మితంగా తీసుకోవడం ఉత్తమం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్న వారు తమ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరివేపాకులో ఉండే కొన్ని రకాల పోషకాలు కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి వీరు కరివేపాకును డైట్లో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.
జీర్ణ సంబంధిత అల్సర్లు
సాధారణంగా కరివేపాకు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కానీ కడుపులో అల్సర్లు లేదా తీవ్రమైన ఇన్ఫ్లమేటరీ సమస్యలు ఉన్నవారు పచ్చి కరివేపాకును నమలడం వల్ల కడుపులో మంట లేదా ఇబ్బంది కలగవచ్చు.
ఏదీ అతిగా వద్దు
కరివేపాకులో విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. అమృతం కూడా అతిగా తీసుకుంటే విషంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులు కూడా కరివేపాకును పరిమితంగా తీసుకుంటూ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలి.
