Curd: ఉప్పు లేదా చక్కెర.. పెరుగులో ఏది వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది..?
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగును వివిధ రూపాలలో తీసుకుంటుంటారు. అయితే దానిలో కొంతమంది ఉప్పు వేసుకుంటే.. మరికొంత మంది చక్కెర వేసుకుంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..? ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. ఈ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పెరుగు అనేది మన ప్రతి ఇంట్లో సులభంగా లభించే అద్భుతమైన ఆహారం. కాల్షియం, విటమిన్ బి-2, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే పెరుగు, ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు ప్రోబయోటిక్స్‌కు అద్భుతమైన మూలం కాబట్టి ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో అసౌకర్యం తగ్గి, ఎసిడిటీ ఉండదు. అయితే మనం పెరుగును ఉప్పుతోనో లేదా చక్కెరతోనో తినడం అలవాటు. ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి నిజంగా ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగులో ఉప్పు కలిపితే..
పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్పును కొద్ది మొత్తంలో కలపడం వల్ల పెరుగులోని ప్రోబయోటిక్ కంటెంట్‌పై ప్రతికూల ప్రభావం పడదు. ఇది జీర్ణక్రియకు మరింత మేలు చేస్తుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో లేదా వ్యాయామం తర్వాత చెమట ద్వారా ఎలక్ట్రోలైట్‌లను కోల్పోయినప్పుడు, ఉప్పుతో కూడిన పెరుగు తీసుకోవడం చాలా మంచిది. కొద్ది మొత్తంలో ఉప్పును కలపడం వల్ల కేలరీల కంటెంట్ పెరగదు. బరువును నియంత్రించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి పరిమితి పాటించడం తప్పనిసరి.
పెరుగులో చక్కెర కలిపితే..
పెరుగులో చక్కెర కలపడం వల్ల రుచి మెరుగుపడుతుంది. వ్యాయామానికి ముందు లేదా తర్వాత శరీరానికి త్వరగా శక్తి అందించడానికి చక్కెర కలిపిన పెరుగు సహాయపడుతుంది. ముఖ్యంగా తీపి రుచులను ఇష్టపడే పిల్లలకు ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. చక్కెర కలిపి తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. చక్కెర యాడ్ చేయడం వల్ల పెరుగులోని కేలరీలు గణనీయంగా పెరుగుతాయి. దీనిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడానికి దారితీయవచ్చు. చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు, బ్లడ్ షుగర్‌ను నియంత్రించుకోవాలనుకునే వారు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం.
ఏది మంచిది..?
ప్రోబయోటిక్ ప్రయోజనాలు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కేలరీల నియంత్రణ పరంగా చూస్తే.. పెరుగులో ఉప్పును కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది. చక్కెర కలిపిన పెరుగు కేవలం శక్తి కోసం లేదా రుచి కోసం అప్పుడప్పుడూ తీసుకోవచ్చు. కానీ తరచుగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా అధిక బరువు లేదా మధుమేహం సమస్యలు ఉన్నవారికి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








