జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు..
Weight Loss: చలికాలం వచ్చిందంటే చాలు.. మనకు తెలియకుండానే బద్ధకం పెరుగుతుంది. దానితో పాటే బరువు కూడా పెరుగుతుంది. బయట చలిగా ఉండటంతో శారీరక శ్రమ తగ్గుతుంది. కానీ వేడి వేడి పదార్థాలను ఆరగిద్దామన్న ఆకలి మాత్రం రెట్టింపు అవుతుంది. ఈ కారణాల వల్ల చాలా మంది చలికాలంలో ఊబకాయం బారిన పడుతుంటారు.

నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం సులభం కానీ, దాన్ని తగ్గించుకోవడం మాత్రం ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా చలికాలంలో చలి కారణంగా శారీరక శ్రమ తగ్గడం, ఆకలి ఎక్కువగా వేయడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంటారు. అయితే ప్రకృతి ప్రసాదించిన కొన్ని శీతాకాలపు పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జామపండు
బరువు తగ్గాలనుకునే వారికి జామపండు ఒక అద్భుతమైన వరం. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా ఇతర ఆహార పదార్థాలను అతిగా తీసుకోకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.
బొప్పాయి
చర్మ, జుట్టు ఆరోగ్యానికే కాకుండా బరువు తగ్గడానికి కూడా బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా ఒక గిన్నె బొప్పాయి ముక్కలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నారింజ
చలికాలంలో లభించే నారింజ పండ్లు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా నిలయాలు. ఇందులో ఉండే విటమిన్-సి శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనిలోని పొటాషియం, ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. నారింజ రసం కంటే నేరుగా పండును తీసుకోవడం వల్ల శరీరానికి పీచు పదార్థం అందుతుంది. ఇది కొవ్వును తగ్గించడంలో తోడ్పడుతుంది.
యాపిల్స్
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్న సామెత అక్షర సత్యం. యాపిల్‌లో ఉండే పీచు పదార్థం కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో చిరుతిళ్లపై ఆసక్తి తగ్గుతుంది. యాపిల్ ముక్కలపై కొద్దిగా నల్ల మిరియాల పొడి చల్లుకుని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మరింత వేగంగా ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడం అనేది కేవలం వ్యాయామంతోనే సాధ్యం కాదు, సరైన ఆహార నియమాలు కూడా పాటించాలి. ఈ శీతాకాలంలో పైన పేర్కొన్న పండ్లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
