కొత్తిమీర చట్నీ.. తమిళనాడు స్పెషల్ రెసిపీ..! కేవలం 10 నిమిషాల్లో చేసే హెల్తీ చట్నీ..!
తమిళనాడు ప్రత్యేకమైన వంటకాలలో కొత్తిమీర చట్నీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది తీపి, కారం, పులుపు సమతుల్యతతో రుచికరంగా ఉంటుంది. ఇడ్లీ, దోస, అన్నం, చపాతీలకు అద్భుతమైన కాంబినేషన్. తక్కువ సమయంలో ఇంట్లోనే ఈ ఆరోగ్యకరమైన చట్నీ తయారు చేసి కొత్త రుచిని ఆస్వాదించండి.

తమిళనాడు ప్రత్యేకమైన వంటకాలలో కోతిమీర చట్నీ ఒకటి. ఇది మామూలు చట్నీలకు భిన్నంగా ఉండి గొప్ప సువాసన, తీపి కారం మేళవించిన రుచితో ఆకట్టుకుంటుంది. దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోస, ఉప్మా వంటి వంటకాలకు ఇది అదనపు రుచిని అందిస్తుంది. అంతేకాకుండా పరాఠాలు, చపాతీలు, అన్నం, వడలు వంటి వంటకాలతో కూడా ఈ చట్నీ బాగా సరిపోతుంది. ఇంట్లో చేసే ఈ రెసిపీని ఫాలో అయి మీరు కూడా కొత్త రుచిని ఆస్వాదించండి.
కావాల్సిన పదార్థాలు
- కొత్తిమీర – 1 కప్పు
- మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 3
- ఉల్లిపాయ – 1 (చిన్న ముక్కలుగా తరిగినది)
- ఎర్ర మిర్చి – 2
- కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి తగినంత
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – ½ టీస్పూన్
- కరివేపాకు – 5-6 ఆకులు
తయారీ విధానం
ముందుగా ఒక చిన్న పాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఎర్ర మిర్చి వేసి బాగా కలిపి వేయించాలి. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యాక కొత్తిమీర ఆకులు, కొబ్బరి తురుము, ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించాలి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం నీరు జోడించి మెత్తటి పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అతి మృదువుగా కావాలంటే నీరు తగినంత కలపాలి. ఇంకో చిన్న పాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక గ్రైండ్ చేసిన చట్నీ మీద పోయాలి.
ఈ తమిళ స్టైల్ కొత్తిమీర చట్నీను ఇడ్లీ, దోస, ఉప్మా, అన్నం, చపాతీలతో తింటే రుచి అదిరిపోతుంది. ఇది తయారీకి తక్కువ సమయం తీసుకునే చట్నీ కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర వల్ల ఐరన్, విటమిన్ C వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇలా ఇంట్లోనే తమిళనాడు స్టైల్ కొత్తిమీర చట్నీ తయారు చేసుకుని దాని రుచిని ఆస్వాదించండి.