Coffee: కాఫీ తాగడానికి సరైన సమయం ఏది..? తాగేముందు తప్పక తెలుసుకోండి..
ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై యూరోపియన్ హార్ట్ జర్నల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దాదాపు 40,000 మందిపై చేసిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో కాఫీ తాగే సరైన సమయం, గుండె ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి కీలక విషయాలను వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ కప్పుతో రోజును ప్రారంభించడం అలవాటు. అది కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇచ్చే ఎనర్జీ బూస్టర్. అయితే కాఫీ ఎప్పుడు తాగాలి..? ఎంత తాగాలి..? అనే విషయాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించిన ఒక పరిశోధన నివేదిక కాఫీ తాగే సమయంపై ఆసక్తికరమైన నిజాలను వెల్లడించింది.
ఏమిటీ అధ్యయనం?
అమెరికాలో దాదాపు 40,000 మంది వ్యక్తులపై సుదీర్ఘ కాలం జరిగిన ఈ పరిశోధనలో కాఫీ అలవాట్లపై లోతైన విశ్లేషణ చేశారు. వారి ఆహారపు అలవాట్లు, వారు రోజులో ఏ సమయంలో కాఫీ తాగుతారు, ఎంత పరిమాణంలో తీసుకుంటారు అనే అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే కాఫీ అస్సలు తాగని వారి కంటే, క్రమబద్ధంగా కాఫీ తాగే వారు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
పరిశోధనలో తేలిన కీలక అంశాలు
కాఫీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కంటే ఉదయం పూట తాగడం వల్ల అత్యధిక ప్రయోజనాలు ఉంటాయని నివేదిక వెల్లడించింది. కాఫీ సోమరితనాన్ని పోగొట్టడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ సర్వేలో తేలింది.
అతిగా వద్దు.. మితంగా ముద్దు
కాఫీ ఏకాగ్రతను పెంచి, శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చినప్పటికీ.. దాన్ని సరైన సమయంలో తీసుకోవడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఒకసారి కాఫీ తీసుకోవడం వల్ల అది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్ స్పష్టం చేసింది. మీరు కూడా కాఫీ ప్రియులైతే, ఇకపై ఎటువంటి సందేహం లేకుండా మీ ఉదయాన్ని ఒక కప్పు కాఫీతో హ్యాపీగా ప్రారంభించవచ్చు. అయితే చక్కెర, పాలు మితంగా ఉండేలా చూసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




