Pesara Avakaya: కోనసీమ స్పెషల్ పెసర ఆవకాయ రెసిపీ మీ కోసం.. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే..
వేసవి కాలం వస్తూనే మామిడి పండ్ల సీజన్ కూడా మొదలవుతుంది. మామిడి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు కూరలు చేసుకుంటారు. ఏడాది పాటు నిల్వ ఉండే విధంగా రకరకాల ఊరగాయలను తయారు చేసుకుంటారు. ప్రస్తుతం పచ్చళ్ళ సీజన్.. ముఖ్యంగా ఆవకాయల సీజన్ నడుస్తోంది. దీంతో గోదావరి జిల్లా వాసులు రకరకాల ఆవకాయలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అందులో ఒకటి పెసర ఆవకాయ. ఈ రోజు తయారీ విధానం తెలుసుకుందాం..

ఆవకాయల సీజన్ వచ్చిందంటే గోదావరి జిల్లాల వారు మామిడి కాయలతో రకరకాల పచ్చళ్ళను పెడతారు. మాగాయ, ఆవకాయ, బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, ముక్కల పచ్చడి, పెసర ఆవకాయ, నువ్వు ఆవకాయ, వంటి వివిధ రకాల ఆవకాయలు పెట్టడంలో గోదావరి వాసులు సిద్ధ హస్తులు. ఈ రోజు ఆంధ్రుల స్పెషల్ పెసర ఆవకాయ తయారీ విధానం తెలుసుకుందాం.. దీనిని తయారు చేసిన తర్వాత కేవలం 2 రోజులలో తినవచ్చు. దీనిని తక్కువ సమయంలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ పెసర ఆవకాయ సాధారణ ఆవకాయతో పోలిస్తే రుచిలో చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఆవకాయలో ఆవాల పొడికి బదులుగా పెసర పప్పుని ఉపయోగిస్తారు. అందుకే వేరే రుచి వస్తుంది. పెసర ఆవకాయను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
- పుల్లని మామిడి కాయలు – 3
- పెసర పిండి – ఒక కప్పు
- కారం – రుచికి సరిపడా
- దంచిన ఉప్పు – 125 గ్రాములు.
- ఆవ పిండి – ఒక స్పూన్
- పసుపు – చిటికెడు
- నువ్వుల నూనె – సుమారు 350 గ్రాములు
తయారీ విధానము : మందుగా పెసర పప్పుని శుభ్రం చేసుకుని ఎండలో పెట్టి.. మిక్సీ లో వేసి మెత్తని పొడిగా వేసుకోవాలి. ఇలా పెసర పిండిని ఒక కప్పు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి కాయలను ముక్కలుగా కట్ చేసి మూడు కప్పులు తీసుకోవాలి. ఈ మామిడి కాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని కొంచెం నూనె వేసి వాటిని నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులో పెసర పిండి, కారం, ఉప్పు, పసుపు, ఆవ పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నూనె పట్టించిన మామిడి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెసర పిండి పట్టించిన మామిడి కాయ ముక్కలను ఒక జాడీలో లేదా గాజు సీసాలో వేసుకుని ముక్క మునిగేలా నూనె పోసుకుని మూత పెట్టుకోవాలి. ఈ పెసర ఆవకాయను రెండో రోజుల పాటు ఊరనివ్వాలి. తర్వాత గరిటెతో బాగా కలిపి తినడానికి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తక్కువ మోతాదులో పెట్టుకునే పెసర ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఇడ్లీ, గారెలు, దోశెలు , రోటీలు, చపాతీల్లోకి సర్వింగ్ కు సిద్ధం. అయితే ఈ పెసర ఆవకాయ మూడు నెలలు ఉంటుంది . తర్వాత దీని రుచి క్రమంగా తగ్గిపోతుంది .
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








