ఇంట్లో కరివేపాకు చెట్టు ఎండిపోతుందా..? గుబురుగా పెరగాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వంట ఏదైనా సరే.. కొద్దిగా కరివేపాకు వేస్తే వచ్చే ఆ సువాసనే వేరు. అందుకే మార్కెట్‌లో కొనే పని లేకుండా చాలా మంది కరివేపాకు మొక్కను ఇంట్లోనే కుండీల్లో పెంచాలని ఆశపడుతుంటారు. కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే.. మొక్క కొన్ని రోజులకే ఎండిపోవడమో లేదా ఆకులు రాలిపోయి చనిపోవడమో జరుగుతుంది. అసలు మనం తెలియకుండా చేసే ఆ చిన్న తప్పు ఏంటి? అనేది తెలుసుకుందాం..

భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ వంటగదిలో కరివేపాకు లేనిదే ఏ వంటా పూర్తి కాదు. వంటకు అద్భుతమైన రుచిని, సువాసనను అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది మార్కెట్లో కొనే పని లేకుండా ఈ మొక్కను ఇంట్లోనే కుండీల్లో పెంచడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా మంది ఇళ్లలో కరివేపాకు మొక్క నాటిన కొన్ని రోజులకే ఎండిపోవడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటి..? కరివేపాకు మొక్క ఎప్పటికీ వాడిపోకుండా, ఎప్పుడూ పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మొక్క చనిపోవడానికి ప్రధాన శత్రువు అతిగా నీరు పోయడం
కరివేపాకు మొక్కలు ఎండిపోవడానికి లేదా చనిపోవడానికి ప్రధాన కారణం వాటికి అవసరానికి మించి నీరు పోయడమే. ఎక్కువ నీరు పోయడం వల్ల కుండీలో నీరు నిలిచిపోయి వేర్లు కుళ్లిపోతాయి. అందుకే కుండీలోని మట్టి పైభాగం పూర్తిగా తడి ఆరిపోయినట్లు అనిపిస్తేనే నీరు పోయండి. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్కకు అస్సలు నీరు పోయాల్సిన అవసరం లేదు.
సరైన కుండీ, మట్టిని ఎంచుకోండి
కరివేపాకు మొక్క నాటేటప్పుడు కుండీ ఎంపిక చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కుండల కంటే మట్టి కుండలు చాలా ఉత్తమం. నీరు సులభంగా బయటకు పోయేలా కుండీ కింద రంధ్రాలు ఉండేలా చూసుకోండి. ఇక మట్టి విషయానికి వస్తే.. బంకమట్టి లాంటి బరువైన మట్టిని వాడకూడదు. నీరు నిలవకుండా ఉండే ఇసుక మిశ్రమ మట్టిని వాడాలి. ఎరువుగా మీరు పశువుల పేడ, వర్మీ కంపోస్ట్ లేదా వంటింటి వ్యర్థాలతో చేసిన కంపోస్ట్‌ను ఉపయోగించవచ్చు.
ఎండ లేకపోతే మొక్క బతకదు..
కరివేపాకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మంచి సూర్యరశ్మి అవసరం. దీనిని నీడలో ఉంచితే ఆకుల ఎదుగుదల ఆగిపోయి మొక్క చనిపోతుంది. కరివేపాకు మొక్కకు రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అందుకోసం కుండీలను బాల్కనీలో లేదా టెర్రస్‌పై ఎండ తగిలే చోట ఉంచండి.
ఎక్కువ ఆకులు రావాలంటే కత్తిరించడం
మీ మొక్క బాగా ఎదిగి, మరిన్ని కొత్త కొమ్మలు రావాలంటే క్రమం తప్పకుండా కత్తిరించడం చాలా అవసరం. మొక్క పైభాగాన్ని కొద్దిగా తుంచివేయడం వల్ల పక్కల నుండి మరిన్ని కొత్త కొమ్మలు మొలకెత్తుతాయి. దీనివల్ల మొక్క గుబురుగా తయారవుతుంది. అలాగే, కరివేపాకు మొక్కపై మొదట్లో కనిపించే పూలను, మొగ్గలను తుంచివేయాలి. లేదంటే మొక్క బలం అంతా పూలకే పోయి ఆకుల ఎదుగుదల తగ్గిపోతుంది.
వంటింటి చిట్కాలు.. మొక్కకు బూస్టర్లు
కరివేపాకు మొక్క వేగంగా పెరగడానికి కొన్ని సులువైన హోమ్ మేడ్ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి..
పుల్లటి మజ్జిగ, గంజి నీరు: వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగ లేదా గంజి నీటిలో కొద్దిగా నీళ్లు కలిపి పలచగా చేసి మొక్క మొదట్లో పోయాలి. ఇది మొక్కకు మంచి నైట్రోజన్‌ను అందిస్తుంది.
వేప పిండి: వేరు తెగుళ్లను నివారించడానికి, మొక్కకు మంచి ఎరువుగా వేప పిండిని మట్టిలో కలపాలి.
వాడేసిన టీ పొడి: మనం టీ మరిగించిన తర్వాత మిగిలిన టీ పొడిని బాగా కడిగి, ఆరబెట్టి, ఆ పొడిని మొక్క మొదట్లో వేస్తే కరివేపాకు మొక్క ఎంతో పచ్చగా పెరుగుతుంది.
