Health Tips: ఏడాది లోపు పిల్లలకు తేనె తినిపిస్తే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాకే..
పెద్దలకు తేనె ఆరోగ్యానికి ఒక బంగారు నిధి కావచ్చు. కానీ ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఇది విషపూరితం కావచ్చు. కాబట్టి పిల్లలకు తేనె పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వయస్సు వచ్చాక పిల్లలకు తేనె ఇవ్వాలి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో చాలామంది పెద్దలు లేదా మత విశ్వాసాల కారణంగా ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనె తినిపించడం ఒక సాధారణ ఆచారంగా మారింది. తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుందని, గొంతుకు మంచిదని నమ్ముతుంటారు. కానీ నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమని, ఏడాది లోపు పిల్లలకు తేనె అస్సలు ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నారు.
తేనె ఎందుకు హానికరం?
తేనెలో కొన్నిసార్లు ‘క్లోస్ట్రిడియం బోటులినమ్’ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెద్దల జీర్ణవ్యవస్థలో సులభంగా నశించిపోతుంది. కానీ ఏడాదిలోపు శిశువుల జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఈ బ్యాక్టీరియా వారి శరీరంలో పెరిగి, ‘శిశు బోటులిజం’ అనే తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. శిశు బోటులిజం ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధి సోకిన పిల్లలలో కండరాలు బలహీనపడటం, సరిగా ఏడ్వలేకపోవడం, పాలు పీల్చడంలో, మింగడంలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స అందించకపోతే, ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు.
నిపుణుల హెచ్చరిక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తో పాటు భారతీయ ఆరోగ్య నిపుణులు కూడా ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏ రూపంలోనూ తేనె ఇవ్వకూడదని సలహా ఇస్తున్నారు. అది పచ్చి తేనె అయినా.. వేడి నీటిలో కలిపినా.. లేదా మరే ఇతర ఇంటి నివారణలో ఉపయోగించినా సురక్షితం కాదని చెబుతున్నారు.
పిల్లలకు తేనె ఎప్పుడు ఇవ్వాలి..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలకు ఒక సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత వారి జీర్ణవ్యవస్థ తేనెను జీర్ణించుకునేంత బలంగా తయారవుతుంది. అప్పటి నుంచి తేనెను పరిమిత పరిమాణంలో ఇవ్వడం సురక్షితం. అయితే ఏదైనా కొత్త ఆహారం లాగే తేనెను కూడా మొదట తక్కువ మోతాదులో ఇవ్వడం మంచిది.
పిల్లలకు జలుబు లేదా గొంతు సమస్యలు ఉంటే, తేనె బదులు వైద్యుల సలహా మేరకు తల్లిపాలు, సూప్‌లు లేదా పండ్ల రసాలు వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఇవ్వవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వైద్య సలహా లేకుండా ఏడాది లోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




