Thyroid Diet: థైరాయిడ్ మందులు వేసుకున్నా ఫలితం లేదా? ఈ 5 ఫుడ్స్ మీ శక్తిని నాశనం చేస్తున్నాయి!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ, రోజువారీ చిన్న అలవాట్లు, ముఖ్యంగా ఆహార ఎంపికలు ఈ సమస్యను పెంచే ట్రిగ్గర్‌లుగా మారుతున్నాయని చాలా మంది గుర్తించరు. న్యూట్రిషనిస్ట్ లోగాప్రీతిక శ్రీనివాసన్ ప్రకారం, కొన్ని ఆహారాలలో ఉండే పదార్థాలకు థైరాయిడ్ గ్రంథి సున్నితంగా ఉంటుంది. ఇవి థైరాయిడ్ పనితీరును నెమ్మది చేయవచ్చు లేదా హార్మోన్ల శోషణను అడ్డుకోవచ్చు.

కొందరికి ఎన్ని రకాల మందులు వాడినా థైరాయిడ్ సమస్యను అరికట్టడం చాలా కష్టమవుతుంది. దీనికి అసలు కారణం తెలియక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీనిని కంట్రోల్ చేయడానికి సమతుల్య ఆహారం ముఖ్యం అయినప్పటికీ, కొన్ని రకాల ఆహారాలను నివారించడం ద్వారా ఔషధం, జీవక్రియ కలిసి పనిచేయడంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు.
1. వైట్ బ్రెడ్
సమస్య: థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి శుద్ధి చేసిన పిండితో (Refined Flour) తయారుచేసిన వైట్ బ్రెడ్ అనుకూలమైనది కాదు.
కారణం: దీనిలో ఫైబర్, పోషకాలు ఉండవు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, జీవక్రియపై ఒత్తిడిని పెంచుతుంది. హాషిమోటోస్ వ్యాధి వంటి ఆటో-ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి, గ్లూటెన్ వాపును (Inflammation) ప్రేరేపిస్తుంది. కాబట్టి, వైట్ బ్రెడ్‌కు బదులుగా హోల్-గ్రెయిన్ లేదా గ్లూటెన్-ఫ్రీ బ్రెడ్‌లు మంచి ఎంపిక.
2. బంగాళాదుంప చిప్స్
సమస్య: పొటాటో చిప్స్‌లో ఉండే సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ థైరాయిడ్ ఆరోగ్యానికి ప్రమాదకరం.
కారణం: ఈ కొవ్వులు అయోడిన్‌ను శరీరం గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. థైరాయిడ్ హార్మోన్లు తయారవడానికి అయోడిన్ చాలా అవసరం. తరచుగా వీటిని తినడం వల్ల బరువు పెరిగి, థైరాయిడ్ పనితీరు తక్కువగా ఉన్నప్పుడు మెటబాలిక్ ఒత్తిడి పెరుగుతుంది.
3. వేరుశనగలు
సమస్య: వేరుశనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో గోయిట్రోజెన్స్ అనే సహజ సమ్మేళనాలు ఉంటాయి.
కారణం: ఈ గోయిట్రోజెన్స్ థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అంతరాయం కలిగిస్తాయి. థైరాయిడ్ ఔషధం తీసుకునేవారు రోజువారీగా వేరుశనగలు లేదా పీనట్ బటర్‌ను ఎక్కువగా తింటే, గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి బదులుగా బాదం లేదా వాల్‌నట్‌లు సురక్షితమైనవి.
4. క్రూసిఫెరస్ కూరగాయలు
సమస్య: క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను పచ్చిగా లేదా పెద్ద మొత్తంలో తినడం థైరాయిడ్ రోగులకు మంచిది కాదు.
కారణం: వీటిలో థియోసైనేట్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిలో అయోడిన్‌తో పోటీపడతాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. అయితే, వీటిని ఉడికించడం లేదా వేయించడం ద్వారా వాటి గోయిట్రోజెనిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అప్పుడప్పుడు వండుకొని తినడం సురక్షితం.
5. కాఫీ
సమస్య: ఉదయం తాగే కాఫీ థైరాయిడ్ హార్మోన్ల శోషణకు అంతరాయం కలిగిస్తుంది.
కారణం: థైరాయిడ్ ఔషధం తీసుకున్న వెంటనే కాఫీ తాగడం వల్ల ఆ ఔషధం ప్రభావం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, కాఫీ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను పెంచుతుంది, ఇది థైరాయిడ్ సంబంధిత అలసటను మరింత పెంచుతుంది. మందులు తీసుకున్న తర్వాత కనీసం 30–45 నిమిషాలు ఆగి కాఫీ తాగడం మంచిది.
6. టోఫు సోయా ఉత్పత్తులు
సమస్య: ఆరోగ్యకరమైన ప్రోటీన్‌గా భావించే సోయా ఉత్పత్తులు థైరాయిడ్ పనితీరును సంక్లిష్టం చేస్తాయి.
కారణం: సోయా ఉత్పత్తులలో ఐసోఫ్లేవోన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని అణచివేస్తాయి. అలాగే, సింథటిక్ థైరాయిడ్ ఔషధం యొక్క శోషణకు ఆటంకం కలిగిస్తాయి. సోయాను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదు, కానీ ఔషధం తీసుకునే సమయానికి, సోయా తీసుకునే సమయానికి మధ్య కొన్ని గంటల గ్యాప్ ఉంచడం మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కొరకు, నిపుణుల సలహాల ఆధారంగా ఇవ్వబడింది. మీరు థైరాయిడ్ ఔషధాలు తీసుకుంటున్నట్లయితే, ఆహారంలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.




