పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..

చాలా మంది పెట్ డాగ్స్‌ను ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. వాటిని ఫ్యామిలీలో ఒకరిగా భావిస్తారు. వాటితో ఒక ఎమోషనల్ బాండింగ్ నడుస్తూ ఉంటుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 10:57 am, Fri, 20 November 20
పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..

చాలా మంది పెట్ డాగ్స్‌ను ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. వాటిని ఫ్యామిలీలో ఒకరిగా భావిస్తారు. వాటితో ఒక ఎమోషనల్ బాండింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక ప్రమాదవశాత్తూ అవి మరణిస్తే..వాటి యజమానుల బాధ వర్ణాణాతీతంగా ఉంటుంది. తాజాగా తన పెంపుడు కుక్కపై అమితమైన ప్రేమ పెంచుకున్న 21 ఏళ్ల యువతి అది చనిపోవడంతో…ఆ బాధను జీర్ణించుకోలేక తాను కూడా తనువు చాలించింది. తన పెట్‌ డాగ్‌ను పూడ్చి పెట్టిన సమాధి పక్కనే తనను పూడ్చి పెట్టాలని సూసైడ్ లేఖలో కోరింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే…  ప్రియాన్షు సింగ్ (21) అనే యువతి పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. రాయ్‌గ‌ఢ్ జిల్లా గోర్ఖా ప్రాంతంలోని కొట్రా రోడ్ పోలీస్‌ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో త‌న ఫ్యామిలీతో క‌లిసి నివ‌సిస్తోంది. ఆ కుటుంబం గత నాలుగేళ్లుగా ఓ పెట్ డాగ్‌ను పెంచుకుంటోంది. కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆ పెంపుడు శునకం పరిస్థితి విషమించడంతో నవంబర్ 18న మృతి చెందింది. ప్రేమగా చూసుకునే పెట్ డాగ్ చనిపోవడంతో కుటుంబసభ్యులు విషాదంలో కూరుకుపోయారు. ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతంలో కుక్క మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

అయితే.. ఆ శునకంతో చనువు ఎక్కువగా ఉన్న ప్రియాన్షు సింగ్ బాధను తట్టుకోలేకపోయింది. అది చనిపోయిన రోజు రాత్రే తన గదిలో ఇంటి పైక‌ప్పుకు చెందిన ఓ రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాన్షు ఉరికి వేలాడుతుండటం గమనించిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి త‌ర‌లించారు. త‌న మృత‌దేహాన్ని తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ద‌హ‌నం చేయ‌కుండా, త‌న పెంపుడు కుక్కతో పాటే పాతిపెట్టాలని ని ప్రియాన్షు ఆ సూసైడ్ లేఖలో రాసింది.

Also Read : వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు