సత్తా చాటిన తెలుగు యువ పారిశ్రామికవేత్త! ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు!
ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఆర్థిక అక్షరాస్యత కోసం పనిచేస్తున్న శివ గణేష్ గడ్డం, సామాజిక సేవల ద్వారా గుర్తింపు పొందిన మధులాష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.

తెలుగు యువత ప్రతిభ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ప్రతిష్ఠాత్మకమైన ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2026 జాబితాలో ఇద్దరు తెలుగు పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తమ తమ రంగాల్లో వినూత్న ఆలోచనలు, సామాజిక ప్రభావం కలిగించే కార్యక్రమాల ద్వారా ఈ యువ వ్యవస్థాపకులు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించే స్టార్టప్ జెని5 వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం ఈ జాబితాలో స్థానం సంపాదించారు. పిల్లలు, యువతకు పెట్టుబడులు, పొదుపు, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా కామిక్స్, కథనాలు, డిజిటల్ కంటెంట్ రూపంలో అందిస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే ఆర్థిక అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు విస్తృత ప్రశంసలు పొందుతున్నాయి.
మరోవైపు ఏడోద్వాజ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధులాష్ బాబు క్రోవ్విడి కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. విద్య, సామాజిక అభివృద్ధి, యువత సాధికారత వంటి రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు సమాజంపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఫోర్బ్స్ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రతి ఏడాది ఫోర్బ్స్ సంస్థ 30 ఏళ్లలోపు వయస్సు కలిగిన, వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సృజనాత్మక వ్యక్తులను ఎంపిక చేసి “30 అండర్ 30” జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో చోటు దక్కించుకోవడం ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
