AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు..!

హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు పోలీసుల మానవత్వం, మరోవైపు విధి ఆడిన వింత నాటకంతో కూడిన అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన ఒక మహిళను కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు తమ శక్తినంతా ఒడ్డి ప్రయత్నించినప్పటికీ చివరకు ఆమె ప్రాణాలు దక్కలేదు.

Hyderabad: రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు..!
Woman Dies Of Heart Attack
Sravan Kumar B
| Edited By: |

Updated on: May 30, 2026 | 9:16 AM

Share

హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు పోలీసుల మానవత్వం, మరోవైపు విధి ఆడిన వింత నాటకంతో కూడిన అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన ఒక మహిళను కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు తమ శక్తినంతా ఒడ్డి ప్రయత్నించినప్పటికీ చివరకు ఆమె ప్రాణాలు దక్కలేదు. అయితే, ఆ అత్యవసర సమయంలో పోలీసులు, సాధారణ పౌరులు చూపిన సమయస్ఫూర్తి, మానవత్వం అందరి మనసులను గెలుచుకుంది.

ఈ విషాదకర ఘటన శుక్రవారం (మే 28) ఉదయం సుమారు 9:48 గంటల సమయంలో చోటుచేసుకుంది. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీకి చెందిన 45 ఏళ్ల పొట్ల లావణ్య బేగంపేట్ పరిధిలోని భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా రోడ్డు దాటుతున్నారు. ఆమె రోడ్డు అవతలికి చేరుకున్న వెంటనే, అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి స్పృహ తప్పిపోయారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన స్వామి గంగాధర్, బేగంపేట్ ఓల్డ్ కటమ్ బస్తీకి చెందిన ఎం.డి ఆసిఫ్ అనే ఇద్దరు యువకులు వెంటనే స్పందించారు. సమయం వృధా చేయకుండా మహిళను రక్షించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి పరుగులు తీశారు. పీసీ భరత్, పీసీ మన్మద రావు, హెచ్‌జీ మునీందర్, క్రేన్ డ్రైవర్ సోహైల్, హెల్పర్ సచిన్‌లు వెంటనే ఆ మహిళను సమీపంలోని పెట్రోల్ పంప్ వద్దకు చేర్చి అత్యవసరంగా సీపీఆర్ (CPR) నిర్వహించడం ప్రారంభించారు.

ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు ఈ ఘటనను గమనించి వెంటనే ఆగిపోయారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా ఆ మహిళకు సీపీఆర్ చేశారు. ప్రాణాలు కాపాడేందుకు ‘గోల్డెన్ అవర్’ ఎంతో ముఖ్యమని గ్రహించిన ఏసీపీ శంకర్ రాజు, అంబులెన్స్ కోసం ఎదురుచూడకుండా మహిళను తన అధికారిక వాహనంలోనే ఎక్కించుకుని సమీపంలోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. పోలీసులు, స్థానికులు ప్రాణాలను పణంగా పెట్టి సకాలంలో స్పందించినప్పటికీ, సదరు మహిళ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. విధి ఆమెను ఓడించినప్పటికీ, ప్రాణాలు కాపాడేందుకు శ్రమించిన ఏసీపీ శంకర్ రాజు, ఆయన సిబ్బంది చూపిన సేవాతత్పరతపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విపత్కర సమయంలో మానవత్వంతో స్పందించి మొదటగా సహాయం అందించిన స్థానికులు స్వామి గంగాధర్, ఎం.డి ఆసిఫ్‌లను ప్రభుత్వం తరఫున ‘గుడ్ సమారిటన్ అవార్డు’కు సిఫారసు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us