Heavy Rain Alert: భారీ వర్షాల హెచ్చరిక.. వచ్చే 7 రోజులు ఈ జిల్లాలు అప్రమత్తం! ఎల్లో అలర్ట్ జారీ
Telangana Weather Update: తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవు..

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది.
ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన
ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో వర్షాలు
మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గురువారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో వాతావరణం ఇలా..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడుతుందనీ.. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవున్నాయి. మిగిలిన 23 జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే గమనిస్తూ వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లోని రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
