AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గృహ హింస’ బాధితురాలికి భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు..

‘కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, భాగస్వామిగా, ఒంటరి మహిళగా.. జీవితాంతం స్త్రీ హింసను, వివక్షను, వేధింపులను భరిస్తూనే ఉంది’ అని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అతి తక్కువగా వచ్చే హింస ఇదేనని, మెజారిటీ మహిళలు తప్పనిసరై మౌనంగా ఆ హింసను భరిస్తున్నారని వాపోయింది.

'గృహ హింస’ బాధితురాలికి భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు..
Sanjay Kasula
|

Updated on: Oct 16, 2020 | 4:03 PM

Share

Domestic Violence Act : గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. బాధిత మహిళలకు భర్త తరఫు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని సంచలన తీర్పు చెప్పింది. గృహ హింస చట్టంలో బాధిత మహిళకు భర్త తరఫు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది.

డొమెస్టిక్‌ వయోలెన్స్‌ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్‌ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు సరైనది కాదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా ‘ఏ సమాజ అభివృద్ధి అయినా అక్కడి మహిళల హక్కులను రక్షించే, ప్రోత్సహించే సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. డీవీ చట్టంలో ‘ఉమ్మడి గృహం’ నిర్వచనం బాధిత మహిళకు నివాస హక్కు కల్పించే విధంగా విస్తృతార్థంలో ఉంటుందని, దానికి గత తీర్పులో పేర్కొన్న వివరణ సరిగా లేదని తోసిపుచ్చింది.

‘బాధిత మహిళ భర్తకు వాటా ఉన్న ఉమ్మడి కుటుంబం నివసించే ఇల్లు’ అనే అర్థంలో మాత్రమే ఉమ్మడి గృహం నిర్వచనాన్ని తీసుకోకూడదని తేల్చిచెప్పింది. ఉమ్మడి గృహం అంటే బాధిత మహిళ నివసిస్తున్న, లేదా గతంలో భర్తతో కలిసి నివసించిన సొంత లేదా అద్దె ఇల్లు అనే అర్థం కూడా ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టి బాధిత మహిళకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

డీవీ క్రిమినల్‌ కేసు విచారణలో సంబంధిత ఉమ్మడి గృహంలో బాధిత మహిళకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంటూ ఇచ్చిన మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను.. ఆ ఇంటి హక్కుకు సంబంధించిన సివిల్‌ దావాలోనూ పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించాలని సివిల్‌ కోర్టుకు సూచించింది.

ఢిల్లీకి చెందిన 76 ఏళ్ల సతీశ్‌ చందర్‌ అహూజా వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఢిల్లీలోని స్వగృహం పూర్తిగా తనదేనని, దానిపై తన కుమారుడికి కానీ, కోడలుకు కానీ ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ అహూజా స్థానిక కోర్టులో దావా వేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు తన భార్య నుంచి విడాకులు కోరుతూ మరో కేసు దాఖలు చేశారు. మరోవైపు, ఆయన కోడలు గృహ హింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టారు.

అహూజా వేసిన కేసుని విచారించిన స్థానిక సివిల్‌ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఆ ఇంటినుంచి కోడలు వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనిపై ఆయన డిక్రీ తెచ్చుకున్నారు. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక క్రిమినల్‌ కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆమెను ఆ ఇంటినుంచి పంపివేయవద్దని తీర్పునిచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజా ఈ ఆదేశాలనిచ్చింది.