అమ్మను అడవి పాలు చేసిన కసాయి కొడుకులు

నవమోసాలు మోసి.. కనిపెంచిన తల్లిపట్ల కర్కశంగా వ్యవహరించారు ఆ కసాయి కొడుకులు. 90 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మను కంటికి రెప్పలా చూసుకోవల్సిన సుపుత్రులే ఆమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డునపడేశారు. ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవి పక్కన వదిలేశారు. తల్లి పట్ల వారు వ్యవహరించిన తీరు మానవత్వానికే మాయని మచ్చగా మారింది.

మానవత్వం మంటగలపిన ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని పెంగరగుంట సమీపంలో వెలుగులోకి వచ్చింది. పలమనేరు–గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిలోని పెంగరగుంట సమీప అడవికి ఆనుకుని 90 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి పెట్టివెళ్లారు. ఆహారం లేక నీరసించిన శరీరంతో కదలలేని స్థితిలో ఉన్న ఆ తల్లిని స్థానికులు గమనించి చేరదీశారు. రోడ్డు పక్కనున్న కుంటిగంగమ్మ ఆలయం వద్ద వదిలిపెట్టి వెళ్లారు. మూడు రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షానికి తడుస్తూనే ఉంది. ఏ దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది. విషయం తెలిసిన గ్రామ వలంటీర్లు అక్కడికి చేరుకుని ఆ తల్లిని చేరదీశారు. అనంతరం ఆమెకు భోజనం, మంచినీటి సదుపాయం కల్పించారు. స్థానిక అధికారుల సమాచారం మేరకు కుంటిగంగమ్మ ఆలయానికి చేరుకున్న పలమనేరు తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆమెను పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. వృద్ధురాలికి సంబంధించిన వారి వివరాలు తెలిశాక వారికి అప్పగిస్తామన్నారు. అయితే, కన్నవారికి ఆ వృద్ధురాలు భారమై ఇలా వదిలించుకున్నారేమోనని కొందరు భావిస్తున్నారు.