AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kayan: మీ అయ్య జాగీరా..? తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలనుకున్న జనసేన సమావేశానికి అనుమతి లభించకపోవడంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమని పేర్కొన్న ఆయన, జనసేన తెలంగాణలోనే పుట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో తన ప్రవేశాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రంగా స్పందించిన పవన్, తెలంగాణ ఎవరి జాగీరు కాదని అన్నారు. రేవంత్ రెడ్డిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

Pawan Kayan: మీ అయ్య జాగీరా..? తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2026 | 5:07 PM

Share

తెలంగాణ పాలిటిక్స్‌ను పవన్ కల్యాణ్ మీటింగ్ హీటెక్కించింది. రాష్ట్ర ఆవిర్భావం రోజు తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో సమావేశం ఏర్పాటు చేయగా పోలీసులు పర్మీషన్ ఇవ్వలేదు. హైకోర్ట్‌లో లంచ్‌ మోషన్ పిటిషన్ వేసినా.. స్క్రూటినీ దశలోనే పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు రిజిస్ట్రి. దీంతో మీటింగ్ రద్దు చేసుకున్న పవన్.. ప్రెస్ మీట్ నిర్వహించారు.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే పవన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణపై నాకున్న ప్రేమ.. రాజకీయాలకు అతీతం.. తెలంగాణలో లక్ష మందికి పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్నారు.. జనసేన తెలంగాణలో ఎందుకని కొందరు అంటున్నారు.. తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది’’.. అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదని.. విభజనతో వచ్చిన ప్రేమకాదని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి పోరాట స్ఫూర్తిని పొందానని.. తన సినిమాల్లో తెలంగాణ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. తెలంగాణ నలుమూలలా తిరిగినవాడినని.. కానీ.. ఇప్పుడు వద్దంటున్న వారు తిరిగారా ..? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ రావొద్దంటూ వీళ్లెవరు అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్‌ అంటున్నారు.. మీరెవరు నన్ను బెదిరించడానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్‌ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. తెలంగాణ కంటే ఏపీలోనే బెదిరింపులు ఎక్కువ.. బాంచన్‌ అనే వాళ్లం అయితే పార్టీ పెడతామా.. భయపడేవాళ్లం అయితే పార్టీ పెడతామా అంటూ పవన్‌ వివరించారు. KCR ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైనా ఒక్క మాట అన్నానా..? తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని.. ఎన్ని తిట్టినా పట్టించుకోనని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమని.. తాను చెరువు భూమిని కబ్జా చేసినట్లు తేలితే.. తానే రాసిస్తాననని పేర్కొన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా అని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చింది.. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే.. వాళ్లు ఇక్కడెలా ఉంటారని ప్రశ్నించారు.

వీడియో చూడండి..

Follow Us