AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Roti: రొటీన్‌ చపాతీ బోర్‌ కొట్టిందా?.. ఒక్కసారి ఈ ఓట్స్‌ రోటి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కవాలంటారు

మీరు రోజూ తినే చపాతీలు, జొన్న రొట్టెలు బోర్ కొట్టాయా?.. కొత్తగా ఆరోగ్యంగా ఉండేందుకు ఏవైనా వెరైటీ రోటీలు తినాలి అనుకుంటున్నారా? అయితే ఓట్స్ రోటీ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

Oats Roti: రొటీన్‌ చపాతీ బోర్‌ కొట్టిందా?.. ఒక్కసారి ఈ ఓట్స్‌ రోటి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కవాలంటారు
Oats Roti Recipe
Anand T
|

Updated on: Jun 02, 2026 | 5:04 PM

Share

ఓట్స్ రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఇతర అవసరమైన పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడానికి, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. అందుకే ఈ రోజుల్లో ప్రజలు ఓట్స్‌ను తమ డైట్‌లో రకరకాలుగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లోనే ఎంతో సులభంగా, టేస్టీగా, హెల్తీగా గ్లూటెన్-ఫ్రీ ఓట్స్ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • ఓట్స్ పిండి: 1 కప్పు
  • నీళ్లు: 1 కప్పు
  • నెయ్యి: 1 చిన్న చెంచా
  • ఉప్పు: 1/4 చిన్న చెంచా

ఓట్స్ రొట్టె తయారీ విధానం

ముందుగా ఓట్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత జల్లెడ పట్టుకుంటే గరుకు భాగం విడిపోయి, మెత్తటి ఓట్స్ పిండి తయారవుతుంది. తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో నెయ్యి, ఉప్పు వేయాలి. ఆ తర్వాత మంట తగ్గించి, ఓట్స్ పిండిని కొద్దికొద్దిగా వేస్తూ గడ్డలు కట్టకుండా బాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత , దానిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి.

ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఓట్స్ రొట్టెలు పలటాయించేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, బటర్ పేపర్ ఉపయోగించడం మంచిది. బటర్ పేపర్ పై కొద్దిగా పొడి పిండి చల్లి, దానిపై పిండి ముద్దను ఉంచాలి. పైనుంచి మరొక బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతో మెల్లగా ఒత్తుకోవాలి లేదా ఏదైనా ప్లేట్‌తో లైట్‌గా ప్రెస్ చేసి రొట్టె ఆకారాన్ని తీసుకురావచ్చు.

పెనం వేడి చేసి, సిద్ధం చేసుకున్న రొట్టెను దానిపై వేయాలి. మీడియం మంట మీద రొట్టెను రెండు వైపులా తిప్పుతూ చక్కగా కాల్చుకోవాలి. అంతే వేడివేడి, మెత్తటి ఓట్స్ రొట్టె సిద్ధం అయినట్టే. దీన్ని మీకు నచ్చిన కూర లేదా పప్పుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us