Nellore GGH Superintendent: జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అరాచకాలు నిజమే.. కమిటీ నివేదిక అధారంగా ప్రభాకర్‌పై బదిలీ వేటు
ఆడియో టేపులతో అడ్డంగా బుక్కైన సూపరింటెండెంట్ ఇష్యూపై విచారణ జరిపిన కమిటీలు.. వేధింపులకు గురి చేసినట్లుగా తేల్చారు.
Nellore GGH Superintendent Prabhkar: ఆయన వెకిలి వేషాలు, స్టూడెంట్స్‌ని వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా వాస్తవమని నిర్ధారణ అయ్యింది. ఆడియో టేపులతో అడ్డంగా బుక్కైన సూపరింటెండెంట్ ఇష్యూపై విచారణ జరిపిన కమిటీలు.. వేధింపులకు గురి చేసినట్లుగా తేల్చారు. దీంతో ఆయనపై బదిలీ వేటు వేసింది ఏపీ రాష్ట్ర సర్కార్.
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ హౌస్ సర్జన్ పక్కా ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చింది. నిజంగా ప్రభాకర్ ప్రవర్తన బాధితురాలు చెప్పినట్లుగానే ఉందా? లేక ఆరోపణలా అనే విషయాన్ని తేల్చడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కమిటీ బాధితురాలు బయటపెట్టిన ఆడియో టేపులతో పాటు పూర్తి వివరాలతో ఓ నివేదికను తయారు చేసింది. సూపరింటెండెంట్ ప్రభాకర్ నిజంగానే వేధింపులకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ప్రభాకర్‌ను నెల్లూరు జీజీహెచ్ నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి బదిలీ చేశారు.
నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ప్రభాకర్ హౌస్ సర్జన్‌ని వేధింపులకు గురి చేశాడు. ఇదే విషయాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు సూపరింటెండెంట్‌ని ఫోన్‌లో కడిగిపారేసింది. సూపరింటెండెంట్ హోదాను అడ్డుపెట్టుకొని ప్రభాకర్ తరచూ యువతికి ఫోన్ చేసి మానసికంగా వేధించడంతో విసిగిపోయిన బాధితురాలు ఫోన్‌లోనే అతడికి బుద్ధి చెప్పిన ఆడియో వాయిస్ బయటకు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. బాధితురాలి పక్షాన అండగా నిలిచిన మహిళా కమిషన్ సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఇందుకోసం విచారణ కమిటీని వేశారు. కమిటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ వేధింపుల వ్యవహారం వాస్తవమేనని తేల్చడంతో .. తిరుపతి రుయా ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.