AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Myanmar Violence: మయన్మార్‌లో ఆగని మారణహోమం.. 24 గంటల్లో వందమందికిపైగా హతం!

మయన్మార్‌లో మరోసారి మారణహోమం చెలరేగింది. తాజాగా శని, ఆదివారాల్లో మయన్మార్ సైనికులు జరిపిన కాల్పుల్లో సుమారు వంద మంది మరణించినట్లు తెలుస్తోంది.

Myanmar Violence: మయన్మార్‌లో ఆగని మారణహోమం.. 24 గంటల్లో వందమందికిపైగా హతం!
Myanmar
Rajesh Sharma
|

Updated on: Apr 11, 2021 | 4:43 PM

Share

Myanmar Violence continue since two months: మయన్మార్‌లో మరోసారి మారణహోమం చెలరేగింది. తాజాగా శని, ఆదివారాల్లో మయన్మార్ సైనికులు జరిపిన కాల్పుల్లో సుమారు వంద మంది మరణించినట్లు తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలను మయన్మార్ మిలిటరీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులపై బాగో నగరంలో జరిపిన కాల్పుల్లో శనివారం ఒక్కరోజే 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అసిస్టెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ అనే స్వతంత్ర సంస్థ ఈ గణాంకాలను ప్రకటించింది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మయన్మార్‌ నౌ అనే వెబ్‌సైట్‌ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. సైనికవాహనాల్లో మృతదేహాలను తీసుకెళ్లి పగోడా వద్ద పడేశారని తెలిపింది. ఆందోళనకారులపైకి మయాన్మార్ మిలిటరీ భారీ ఆయుధాలను, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడ్లను, మోర్టార్లను ప్రయోగిస్తోందని పేర్కొంది. మార్చి 14న యాంగూన్‌లో జరిగిన కాల్పుల్లో 100 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే గత రెండున్నర నెలలుగా అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మయన్మార్ మిలిటరీ నిరంకుశంగా వ్యవహరిస్తోంది. మిలిటరీ యాక్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న వారిపై సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఉక్కుపాదంతో నిరసనకారులను అణచివేస్తోంది మయన్మార్ సైన్యం. మార్చిలో వారం రోజుల పాటు కొనసాగిన సైనిక దమన కాండలో 500 మందికి పైగా పౌరులు మరణించినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అనధికారికంగా మ‌ృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే వుంటుందని అంఛనా.

రెండు నెలల క్రితం సైన్యం దేశంపై పట్టు సాధించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి అంటే గత రెండు నెలల క్రితం మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఊహకందని విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రజాందోళనలను అణచివేసేందుకు బర్మా మిలిటరీ అత్యంత కఠినంగా, కర్కషంగా వ్యవహరిస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి పారేస్తోంది. తాజాగా తమ దేశ పౌరుల పైనే వైమానిక దాడులు చేయడంతో వేలాదిమంది మయన్మార్‌ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొరుగు దేశాలవైపు మరీ ముఖ్యంగా సమీప థాయ్‌లాండ్‌ వైపు వలస పోతున్నారు.

తాజాగా మయన్మార్‌లో కొనసాగుతున్న దమనకాండను అగ్రరాజ్యం అమెరికా సహా పలుదేశాలు ఖండించాయి. సైన్యం సృష్టించిన రక్తపాతాన్ని భయానక చర్యగా పలు దేశాలు పేర్కొంటున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. మయన్మార్‌లో శనివారం జరిగిన సైనిక హింసలో 114 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చర్యలను ఐరాసతో పాటు పలు దేశాలు ఖండించాయి. ‘మయన్మార్‌లో ఆందోళనకారులపై భద్రతాదళాలు సృష్టించిన రక్తపాతం భయంకరమైనది. కొంత మంది కోసం సైన్యం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. అక్కడ కొనసాగుతున్న ఈ సైనిక చర్యలను బర్మా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు’ అని బ్లింకెన్‌ తెలిపారు. మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై శనివారం భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాగా, ఫిబ్రవరి 1న సైన్యం అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 400 మంది పౌరులు మరణించారు.

ఫిబ్రవరి ఒకటవ తేదీన సైనిక తిరుగుబాటుతో వార్తలకెక్కిన మయన్మార్ (బర్మా)లో ఆర్మీ అరాచకం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాలన్న ప్రజా సంకల్పాన్ని సైనికాధికారులు తమ బూట్ల కింద అణచివేస్తున్నారు. సామాన్య ప్రజల నెత్తిన కర్ఫ్యూ అస్త్రాన్ని సంధించి.. జనజీవనాన్ని దాదాపు స్థంభింపచేస్తోంది బర్మా ఆర్మీ. దేశంలో అతిపెద్ద నగరం యాంగూన్ (రంగూన్)తోపాటు పలు నగరాలు, పట్టణాలు సైనిక బలగాల కవాతులతో భీతిల్లిపోతున్నాయి.

దేశంలో తరచూ ఇంటర్‌నెట్‌ను నిలిపి వేస్తున్నారు సైనిక పాలకులు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలపై సైన్యం నిషేధం విధించింది. ప్రజాహక్కుల రద్దు వంటి సైనిక ప్రభుత్వ ఆదేశాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రజలను, నిరసనకారులను భయభ్రాంతులను చేసేందుకు సైనిక ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. గతేడాది (2020 నవంబర్‌లో) జరిగిన ఎన్నికల్లో అవకతవకలపై సక్రమ విచారణ జరపలేదన్న సాకుతో.. సైన్యం ప్రభుత్వాన్ని కూలదోసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి ఫిబ్రవరి 1వ తేదీన అధికార పగ్గాలు చేపట్టాలని అనుకున్న ఆంగ్‌ సాన్‌ సూకితోపాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులను సైన్యం నిర్బంధించింది. ఇక దేశంలో చెలరేగుతున్న నిరసనలపై ఉక్కు పాదం మోపేందుకు సైనికాధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఆంగ్‌ సాన్‌ సూకిని ఫిబ్రవరి 15వ తేదీన న్యాయస్థానంలో హాజరు పరచాల్సి వుండగా.. దానిని సైన్యం ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని ఆర్మీ ప్రభుత్వం నిషేధించింది. అంతేకాకుండా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది.

నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్న వార్నింగ్‌ను ఖాతరు చేయకుండా దేశ రాజధాని నయాపైటాతో సహా పలు ప్రాంతాల్లో లక్షలాది పౌరులు వీధులకెక్కారు. ఈ నిరసనల్లో ప్రభుత్వోద్యోగులు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకోవడం విశేషం. నిరసనకారులతో కలిపి ఉద్యమించేందుకు రైల్వే శాఖ సిబ్బంది కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. సైన్యం ఉద్దేశపూర్వకంగా విడుదల చేయ తలపెట్టిన ఖైదీలను ఎదుర్కొనేందుకు మయన్మార్‌ ప్రజలు ఐక్య రక్షక దళాలను తమ తమ ప్రాంతాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మయన్మార్‌లో అంతర్యుద్ధం నెలకొనే పరిస్థితి వుందని అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తోంది.

మయన్మార్ వ్యవహారాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారిపై హింసాత్మక చర్యలను మానుకోవాలని అమెరికా మయన్మార్ సైనికాధికారులను హెచ్చరించింది. అమెరికాతోపాటు కెనడా సహా 12 యూరోపియన్‌ దేశాల రాయబారులు మయన్మార్‌ సైనిక ప్రభుత్వానికి సునిశిత రీతిలో హెచ్చరిక జారీ చేశారు. మయన్మార్‌లో జరిగిన రాజకీయ నాయకుల అరెస్టులను కూడా ఈ దేశాల రాయభారులు ఖండించారు. మరోవైపు పొరుగునే వున్న మయన్మార్ వ్యవహారాలను భారత ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి మయన్మార్ వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రధాని మోదీకి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది.

గత నవంబర్ నెలలో మయన్మార్ దేశంలో ఎన్నికలు జరుగుతుంటే ఇన్నేళ్ళ తర్వాతైనా ఆ దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని యావత్ ప్రపంచం భావించింది. ఎన్నికలు జరిగి.. నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్.ఎల్.డీ) అధినేత అంగ్ సాన్ సూకీ లాంటి ప్రజాస్వామ్యం పోరాట యోధురాలు ఆధిపత్యం సాధిస్తే పలు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ.. ఆ దేశ రాజ్యాంగమే అక్కడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తాజాగా ఆర్మీ తిరుగుబాటుతో నిరూపణ అయ్యింది. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం అక్కడి సైన్యానికి విశేషాధికారాలున్నాయి. దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న అది బర్మా ఆర్మీ సానుకూల, వ్యతిరేక విధానాలపైనే ఆధారపడి వుంటుంది.

2020 నవంబరు నెలలో ఎన్నికలు జరిగిన నాటి నుంచీ సైన్యం, దాని అడుగులకు మడుగులొత్తే రాజకీయ నాయకుల కదలికలు అనుమానాస్పదంగానే ఉన్నాయని పలు దేశాల రాయభారులు ముందే హెచ్చరించారు. ఆర్మీ తిరుగుబాటు చేసేందుకు సరిగ్గా ఒక వారం రోజుల ముందు అనేక విదేశీ రాయబార కార్యాలయాలు తిరుగుబాటు జరిగే అవకాశముందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. కానీ ఈ ప్రచారాన్ని మయన్మార్‌ సైన్యం కొట్టి పారేసింది. మయన్మార్ సైన్యాన్ని అనవసరంగా అనుమానిస్తున్నారని తేల్చేసింది. కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో తిరుగుబాటు అనుమానాలపై కొందరు జర్నలిస్టులు ప్రశ్నించగా… సైన్యం ప్రతినిధి ఆ అవకాశాలను తోసిపుచ్చలేదు. దాంతో సైనిక తిరుగుబాటు ఖాయమన్న అభిప్రాయాన్ని పలు రాయభార కార్యాలయాలు తమ తమ దేశాలకు సమాచారమందించాయి.

మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నా.. అక్కడి సైన్యానికే విశేషాధికారాలుంటాయి. అందుకే సుదీర్ఘ గృహ నిర్బంధం నుంచి విడుదలై అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆంగ్‌ సాన్‌ సూకీ… మొదట్నించి సైన్యంతో సయోధ్యతోనే వ్యవహరించారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్‌ సైనికులు జరిపిన దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించినా… సూకీ మాత్రం సైన్యానికే మద్దతిచ్చారు. అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠకు మచ్చ వస్తున్నా సూకీ సైన్యంతో స్నేహంగానే మెలిగారు. ఇతరత్రా కూడా వారిపై ఎన్నడూ విమర్శలు గుప్పించలేదు.

నవంబర్ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్.ఎల్.డీ) పార్టీ ప్రతినిధుల సభలో 258 సీట్లు, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్‌లో 138 సీట్లు గెలుచుకుంది. సైన్యం బహిరంగంగా మద్దతు ప్రకటించిన యూనియన్ సాలిడారిటీ డెవలప్‌మెంటు పార్టీ (యూ.ఎస్.డీ.పీ) ఘోర పరాజయం పాలైంది. దాంతో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నించి దేశంలో సైనిక తిరుగుబాటు ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బంపర్ మెజారిటీతో పాలన పగ్గాలు చేపట్టే అవకాశాలుండడంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రతిపాదనను అంగ్ సాన్ సూకీ పరిశీలించడం ప్రారంభించారు. ఈ దిశగా సూకీ బృందం సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది. రాజ్యాంగాన్ని సవరించి, సైన్యానికి వున్న విశేషాధికారాలను కత్తిరించాలన్న సూకీ చర్యలను సైనికాధికారులు సునిశితంగా గమనిస్తూ వచ్చారు. కొత్త పార్లమెంటు ఫిబ్రవరి 1న సమావేశం కానుందగా.. ఈ సెషన్‌లోనే రాజ్యాంగ సవరణకు సూకీ సర్కార్ చర్యలు చేపట్టే సంకేతాలను సైనికాధికారులు గమనించారు. దాంతో సరిగ్గా పార్లమెంటు సెషన్ ప్రారంభమయ్యే రోజున తెల్లవారుజామునే సైన్యం ఉన్నట్లుండి తిరుగుబాటుకు దిగింది.

సైనికాధినేత మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ గత కొంతకాలంగా దేశాధ్య పదవిపై కన్నేశారు. ఇందుకోసం ఆయనకు పార్లమెంటులో మెజార్టీ సభ్యుల మద్దతు అవసరం. మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం… పార్లమెంటులో 25 శాతం సీట్లు సైన్యం చేతిలో ఉంటాయి. రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో తమ మద్దతు అనివార్యంగా మారేందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తమ కనుసన్నల్లో నడిచే యూఎస్‌డీపీ సీట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో… స్వయంగా 25 శాతం సీట్లున్నా సైన్యం రాజ్యాంగ సవరణను అడ్డుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో సైనికాధినేత లయాంగ్‌ దేశ అధ్యక్షుడయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. రాజ్యాంగబద్ధంగా దేశాధ్యక్ష పదవి తనకు దక్కే అవకాశాలు లేకపోవటంతో పాత పద్ధతిలో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశారు లయాంగ్. అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్‌పై సమరంలో మునిగి వుండడం.. అగ్రరాజ్య అమెరికా తమ అంతర్గత విషయాలతో బిజీగా వుండడం మయన్మార్ సైన్యానికి అనుకూల వాతావరణాన్ని కల్పించింది.

లయాంగ్‌ అధ్యక్ష పీఠాన్ని ఆశించడానికి కూడా బలమైన కారణాలున్నాయి. 2021 జులైలో ఆయనకు 65 ఏళ్ళు నిండుతాయి. దాంతో సైన్యాధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వుంటుంది. మామూలుగానైతే ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం ఏమీ కాదు. కానీ… రిటైర్మెంట్‌తో లయాంగ్‌కు కష్టాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది. రోహింగ్యాలపై ఆయన సారథ్యంలోనే మారణకాండ జరిగిందనేది అంతర్జాతీయంగా ఉన్న ఆరోపణ. రిటైరైన తక్షణమే ఆయనపై అంతర్జాతీయంగా విచారణకు దారులు తెరుచుకుంటాయి. అప్పుడు సూకీ మద్దతిస్తారో లేదో తెలియదు. పదవిలో ఉంటే ఈ విచారణలన్నింటి నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే లయాంగ్‌ సైనిక తిరుగుబాటుకు ఆదేశించారన్నది పరిశీలకుల అంఛనా. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నట్లుగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు లయాంగ్.. సైనిక తిరుగుబాటు అనివార్యమైనందునే ఆ దిశగా చర్యలు తీసుకున్నామని ప్రకటించడం గమనార్హం.

తాను అనుకున్న ప్రకారం సైనిక తిరుగుబాటుకు దిగిన లయాంగ్.. అంగ్ సాన్ సూకీని మరోసారి గృహనిర్బంధానికి పరిమితం చేశారు. దేశంలో టీవీ ప్రసారాలను, ఇంటర్ నెట్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించారు. అయితే.. సైన్యం చర్యలపై దేశ ప్రజలు తమదైన శైలిలో నిరసన చర్యలకు దిగుతున్నారు. అంతర్జాతీయ సమాజం మయన్మార్ వైపు దృష్టి సారించేలా ఆ దేశ ప్రజాస్వామ్య వాదులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై ఉక్కుపాదం మోపేందుకు మయన్మార్ ఆర్మీ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఇది ఆందోళన కలిగించే పరిణామమని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ALSO READ: ప్రచార పర్వంలో సవాళ్ళ జోరు.. హీటెక్కుతున్న తిరుపతి ఉప ఎన్నిక.. సై అంటే సై

ALSO READ: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు

Follow Us