AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా? అయితే, ఈ కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి! కడుపు చల్లగా, రుచికి రుచి

రోజూ తినే రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లతో బోర్ కొట్టిన వారికి పెరుగు ఉప్మా (Dahi Upma) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇది ఉదయం అల్పాహారంగానే కాకుండా, రాత్రి వేళ తేలికపాటి డిన్నర్‌గా కూడా చాలా బాగుంటుంది. పెరుగు ఉపయోగించడం వల్ల ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. కడుపును చల్లగా ఉంచుతుంది. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ కమ్మని ఉప్మా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది.

ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా? అయితే, ఈ కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి! కడుపు చల్లగా, రుచికి రుచి
Curd Upma RecipeImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: May 19, 2026 | 6:51 PM

Share

అల్పాహారాల్లో ఉప్మా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం అయినప్పటికీ, రోజువారీ రొటీన్ ఉప్మా తిని చాలామందికి బోర్ కొడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉప్మా పేరు వినగానే ముఖం మాడ్చుకుంటారు. అలాంటి వారి కోసం నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా, కమ్మటి రుచితో ఉండే పెరుగు ఉప్మా (Curd Upma) ఒక బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగు వాడటం వల్ల కడుపుకు చాలా తేలికగా ఉండి, త్వరగా జీర్ణమవుతుంది.

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ (1 కప్పు), కమ్మటి పెరుగు (1 కప్పు), నీళ్లు (2 కప్పులు), ఉల్లిపాయ (1), టమాటా (1), పచ్చి బఠానీలు (అర కప్పు), అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పసుపు, నెయ్యి, నూనె, రుచికి సరిపడా ఉప్పు, అలంకరణకు వేయించిన పల్లీలు, జీడిపప్పు.

తయారీ విధానం:

మొదట ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా మజ్జిగలా బాగా గిలకొట్టాలి. అందులోనే సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి. ఆపై ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక పచ్చి బఠానీలు వేసి కాస్త మెత్తబడే వరకు ఉడికించాలి.

తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కడాయిలో వేసి, పోపుతో కలిపి ఒక నిమిషం పాటు సన్నని మంట మీద వేయించి, చిటికెడు పసుపు చేర్చాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి (సిమ్‌లో ఉంచి), సిద్ధం చేసుకున్న పెరుగు-నీళ్ల మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ, రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.

మూతపెట్టి సన్నని మంట మీద రవ్వ నీటిని పీల్చుకుని, క్రీమీగా దగ్గరపడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా పైనుంచి కొద్దిగా నెయ్యి, వేయించిన పల్లీలు, జీడిపప్పు చల్లితే వేడివేడి పెరుగు ఉప్మా సిద్ధం. దీన్ని పల్లీ చట్నీ లేదా ఆవకాయ పచ్చడితో తింటే రుచి అమోఘంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us