పాదాలపై చెప్పుల మొండి మచ్చలా? ఇంట్లో ఈ 3 పదార్థాలు ఉంటే చాలు..! ఈజీగా తొలగించుకోవచ్చు..
వేసవి కాలంలో చాలామంది ఓపెన్ ఫుట్‌వేర్ లేదా స్ట్రెండీ శాండల్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ఈ సీజన్‌లో ఉండే తీవ్రమైన ఎండ, వేడి, ధూళి కారణంగా పాదాలపై చెప్పుల ఆకారంలో నల్లటి మచ్చలు (Sandal Marks), ట్యానింగ్ ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ నల్లదనం చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించి, పాదాలను దాచడానికి చాలామంది బూట్లు వేసుకోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ మీ పాదాలపై కూడా ఇలాంటి మొండి మచ్చలు ఉంటే, బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ సూచించిన ఈ సులభమైన సహజసిద్ధమైన DIY ప్యాక్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.

వేసవిలో ఎండ తీవ్రత, ధూళి వల్ల పాదాలపై చెప్పులు లేదా శాండల్స్‌తో నల్లటి మొండి మచ్చలు(Tanning) ఏర్పడుతుంటాయి. ఈ సమస్యకు ఇంట్లోనే లభించే కేవలం మూడు వస్తువులతో సులభంగా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సహజసిద్ధమైన ప్యాక్ ట్యానింగ్‌ను అద్భుతంగా తగ్గిస్తుంది. తిరిగి మచ్చలు పడకుండా ఉండటానికి ఎండలోకి వెళ్లేటప్పుడు పాదాలకు సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఈ హోమ్‌మేడ్ ప్యాక్ కోసం మీకు పెద్దగా శ్రమ లేదా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే ఈ మూడు వస్తువులు ఉంటే సరిపోతుంది. దీని కోసం కావలసిన వస్తువులు, ప్యాక్ తయారీ ఇప్పుడు చూద్దాం…
శనగపిండి – 2 చెంచాలు
పెరుగు – 1 చెంచా
పసుపు – చిటికెడు
ఒక చిన్న గిన్నెలో శనగపిండి, పెరుగు, పసుపు వేసి ఎటువంటి గడ్డలు లేకుండా బాగా కలిపి మెత్తటి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. మొదటగా పాదాలను స్వచ్ఛమైన నీటితో కడిగి, ధూళిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను పాదాలపై చెప్పుల మచ్చలు, నల్లదనం ఉన్న భాగాలపై సమానంగా అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు పూర్తిగా ఆరనివ్వాలి. ప్యాక్ ఎండిన తర్వాత, చేతులతో వృత్తాకారంలో మెల్లగా రుద్దుతూ (Scrubbing) నీటితో కడిగేయాలి. చివరగా, పాదాలు పొడిబారకుండా ఉండటానికి మంచి మాయిశ్చరైజర్ రాయాలి.
ఈ ప్యాక్‌లోని శనగపిండి ఒక అద్భుతమైన సహజ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను (Dead skin) తొలగిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా, ట్యానింగ్‌ను వేగంగా తేలికపరుస్తుంది. ఇక పసుపులో ఉండే గుణాలు చర్మానికి మంచి మెరుపును ఇచ్చి, నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. భవిష్యత్తులో పాదాలపై మళ్లీ చెప్పుల మార్కులు పడకుండా ఉండాలంటే, బయటకు వెళ్లేటప్పుడు ముఖంతో పాటు పాదాలకు కూడా తప్పనిసరిగా సన్‌స్క్రీన్ (Sunscreen) లోషన్ రాయడం అలవాటు చేసుకోండి.




