AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: కలలు కనడం కాదు.. వాటిని నిజం చేసుకోవాలంటే ఈ పని చేయాల్సిందే! నీతికథ

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. గొప్ప వ్యక్తిగా ఎదగాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని ఎన్నో కలలు కంటుంటారు. కానీ ఆ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించాల్సిన సమయంలో మాత్రం రేపు మొదలుపెడదాం, ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకుందాం అంటూ వాయిదా వేస్తుంటారు. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. చివరకు కలలు కలలుగానే మిగిలిపోతాయి. అలాంటి వారికి కనువిప్పు కలిగించే ఓ చిన్న కథ గురించి తెలుసుకుందాం..

Moral Story: కలలు కనడం కాదు.. వాటిని నిజం చేసుకోవాలంటే ఈ పని చేయాల్సిందే! నీతికథ
Start Working Towards Your Dreams Today
Srilakshmi C
|

Updated on: Nov 26, 2026 | 10:57 AM

Share

ఒక చిన్న గ్రామంలో ఆశు అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించి తన తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని ఎంతో కోరిక ఉండేది. ప్రతి రాత్రి తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. ఏదో ఒకరోజు పెద్ద ఉద్యోగం సంపాదించాలని, విలాసవంతమైన కారు కొనాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడేవాడు. కానీ అతనిలో ఒక పెద్ద బలహీనత ఉండేది. ఏ పని చేయాలన్నా రేపటికి వాయిదా వేసేవాడు. చదువుకోవాలని అనుకున్నప్పుడు.. ‘ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకుంటాను. రేపటి నుంచి తప్పకుండా చదువుతాను’ అనేవాడు. తండ్రి ఏదైనా పని చెప్పినా.. ‘సరే నాన్నా! కొద్దిసేపట్లో చేస్తాను’ అని చెప్పి గంటల తరబడి కాలక్షేపం చేసేవాడు. ఆ కొద్దిసేపు ఎప్పటికీ ముగిసేది కాదు. చివరకు దుకాణాలు మూసే సమయం వచ్చినా అతను తన పనిని పూర్తి చేసేవాడు కాదు.

ఖాళీ సమయంలో సరస్సు దగ్గర కూర్చొని పగటి కలలు కనేవాడు. ఒకరోజు తాను ఖరీదైన కారు కొనుగోలు చేస్తానని, అందరూ తనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తారని ఊహించుకునేవాడు. కానీ వాస్తవ జీవితంలో మాత్రం చదవడం లేదు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం లేదు. తన లక్ష్యం వైపు ఒక్క అడుగు కూడా వేయడం లేదు. ఇలా నెలలు గడిచాయి. ఆ తర్వాత సంవత్సరం కూడా పూర్తయింది. ఆశు స్నేహితులు కొందరు ఉద్యోగాల్లో చేరారు. మరికొందరు వ్యాపారాలు ప్రారంభించి జీవితంలో ముందుకు సాగారు. కానీ ఆశు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాడు.

ఒకరోజు తన పరిస్థితిని చూసుకుని తీవ్రంగా నిరాశ చెందాడు. రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చుని.. ‘బహుశా నేను కలలు కనడానికి మాత్రమే పనికొస్తానేమో! నా జీవితంలో ఏమీ సాధించలేనేమో!’ అని బాధపడ్డాడు. అప్పుడే అటుగా ఒక జ్ఞానవంతుడైన వృద్ధుడు నడుచుకుంటూ వచ్చాడు. ‘నాయనా! ఎందుకు అంత బాధగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి?’ అని ఆప్యాయంగా అడిగాడు. ఆశు తన మనసులోని బాధనంతా చెప్పుకున్నాడు. తాను ఎన్నో కలలు కంటున్నానని, కానీ ప్రతి పనినీ రేపటికి వాయిదా వేస్తున్నానని వివరించాడు. అంతా విన్న వృద్ధుడు చిరునవ్వుతో.. ‘నాయనా! రేపు సూర్యోదయానికి ముందే నా పొలానికి రా. నీకు ఒక ముఖ్యమైన విషయం చూపిస్తాను’ అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

వృద్ధ రైతు నేర్పిన జీవిత పాఠం!

మరుసటి రోజు ఆశు అనుకున్న సమయానికే నిద్రలేచి వృద్ధుడి పొలానికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరూ కలిసి భూమిని సిద్ధం చేశారు. నేలను దున్ని, విత్తనాలు నాటి, నీళ్లు పోశారు. ఆ తర్వాత వృద్ధుడు ఆశుతో.. ‘నాయనా! ఇక నుంచి ప్రతిరోజూ ఈ పొలానికి వచ్చి మొక్కలకు నీళ్లు పోయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. పంటను జాగ్రత్తగా చూసుకోవాలి’ అని చెప్పాడు. ఆశు కూడా ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొలానికి రావడం ప్రారంభించాడు. మొక్కలకు నీళ్లు పోశాడు. కలుపు మొక్కలను తొలగించాడు. పొలాన్ని శుభ్రంగా ఉంచాడు. అయితే కొన్ని రోజులైనా ఎలాంటి మార్పు కనిపించలేదు. విత్తనాలు నాటిన చోట మొక్కలు కనిపించకపోవడంతో ఆశు నిరాశ చెందాడు. ఒకరోజు వృద్ధుడిని అడిగాడు. ‘తాతయ్యా! మనం ప్రతిరోజూ ఇంత కష్టపడుతున్నాం. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఇలా ఎంతకాలం ఎదురుచూడాలి?’ అని ప్రశ్నించాడు.

అప్పుడు వృద్ధుడు చిరునవ్వుతో.. ‘నాయనా! ప్రతి ఫలితం వెంటనే కనిపించదు. కొన్ని విషయాలు నేల కింద నిశ్శబ్దంగా పెరుగుతుంటాయి. వాటికి సమయం, సహనం, నిరంతర శ్రమ అవసరం’ అని సమాధానమిచ్చాడు. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది! మరికొన్ని వారాలు గడిచాయి. పొలంలో చిన్నచిన్న మొక్కలు కనిపించడం ప్రారంభించాయి. ఆశు వాటిని చూసి ఎంతో సంతోషించాడు. రోజులు గడిచేకొద్దీ మొక్కలు పెద్దవయ్యాయి. చివరకు ఆ పొలమంతా బంగారు రంగులో మెరిసే పంటతో నిండిపోయింది. అప్పుడు వృద్ధుడు ఆశును పిలిచి ఒక ప్రశ్న అడిగాడు. ‘నాయనా! నేను ప్రతిరోజూ విత్తనాలు నాటకుండా, పొలంలో పని చేయకుండా కేవలం ఈ పంట గురించి కలలు మాత్రమే కని ఉంటే ఈరోజు ఇంత మంచి పంట వచ్చేదా?’ అని అడిగాడు. అందుకు ఆశు.. ‘లేదు తాతయ్యా! కష్టపడి పనిచేసినందువల్లే మనకు ఈ పంట వచ్చింది’ అని సమాధానమిచ్చాడు.

అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు. ‘చాలా బాగా చెప్పావు నాయనా! కలలు మాత్రమే విజయాన్ని తీసుకురావు. విజయం కూడా వ్యవసాయం లాంటిదే. విత్తనం నాటిన వెంటనే పంట చేతికి రాదు. ప్రతిరోజూ శ్రమించాలి. సహనంతో ఎదురుచూడాలి. సరైన సమయంలో సరైన పనులు చేయాలి. అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది. జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పదం ‘రేపు’. ఎందుకంటే రేపు ఎప్పటికీ రాదు. నీకు నిజంగా ఉన్నది ఈరోజు మాత్రమే. కాబట్టి నీ కలలను నిజం చేసుకోవాలంటే ఈరోజే పని ప్రారంభించు’ అని హితబోధ చేశాడు. వృద్ధుడి మాటలు ఆశు హృదయాన్ని బలంగా తాకాయి. అప్పటి నుంచి అతను కేవలం కలలు కనడం మానలేదు. కానీ ఆ కలలను నిజం చేసుకునేందుకు కష్టపడటం ప్రారంభించాడు.

ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం మొదలుపెట్టాడు. సమయానికి చదువుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, తన తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటి అలవాట్లను పెంచుకున్నాడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజూ కొద్దికొద్దిగా తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. గతంలో వృథా చేసిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఇకపై ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అలా సంవత్సరాలు గడిచాయి. చివరకు ఆశు తన కష్టానికి తగిన ఫలితాన్ని సాధించాడు. జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. తన తల్లిదండ్రుల కోసం అందమైన ఇల్లు నిర్మించాడు. వారికి సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాడు. ఒకప్పుడు అతన్ని సోమరి అని పిలిచిన గ్రామస్తులే ఇప్పుడు అతన్ని ఆదర్శంగా తీసుకోవడం ప్రారంభించారు. తన జీవితాన్ని మార్చిన వృద్ధ రైతును మళ్లీ కలిసిన ఆశు.. ‘తాతయ్యా! మీరు చెప్పింది నిజం. విజయం కష్టపడటం వల్ల వస్తుంది. కేవలం కోరుకోవడం వల్ల కాదు. మీరు నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పాఠం నేర్పించారు’ అని కృతజ్ఞతలు తెలిపాడు. వృద్ధుడు చిరునవ్వుతో.. ‘నాయనా! కలలు కనడం తప్పు కాదు. కానీ ఆ కలల కోసం ప్రతిరోజూ కష్టపడటం నేర్చుకోవాలి. మేల్కొని ప్రయత్నించే వారికే విజయం దగ్గరవుతుంది’ అని ఆశీర్వదించాడు.

నీతి

  • కలలు కనండి: జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోండి. గొప్పగా ఆలోచించడానికి ఎప్పుడూ భయపడకండి.
  • వాయిదా వేయడం మానండి: రేపు చేద్దాంలే అనే అలవాటు విజయానికి అతిపెద్ద శత్రువు.
  • చిన్న అడుగులతో ప్రారంభించండి: రోజుకు కొద్దిసేపు కష్టపడినా నిరంతరం కొనసాగిస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చు.
  • సహనంతో ఉండండి: ప్రతి ప్రయత్నానికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. అయినా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి.
  • క్రమశిక్షణ అలవాటు చేసుకోండి: ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మంచి పనులే భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. గుర్తుంచుకోండి.. కలలు మాత్రమే కనేవారు తమ ఊహల్లో విజయం సాధిస్తారు. కానీ ఆ కలల కోసం మేల్కొని కష్టపడేవారు నిజ జీవితంలో విజేతలుగా నిలుస్తారు. రేపు ఎప్పటికీ రాదు.. మీకు ఉన్నది ఈరోజే! కాబట్టి మీ విజయ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించండి.

Follow Us