China Vaccine: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు

ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసి తాను మాత్రం సేఫ్‌గా వుండిపోయిన చైనా దేశంలో అంతర్గత రహస్యాలిపుడు ఒక్కటొక్కటే బయటికి వస్తున్నాయి. అసలు కరోనా వైరస్..

  • Rajesh Sharma
  • Publish Date - 3:58 pm, Sun, 11 April 21
China Vaccine: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు
China

China Vaccine lesser effect on coronavirus: ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసి తాను మాత్రం సేఫ్‌గా వుండిపోయిన చైనా దేశంలో అంతర్గత రహస్యాలిపుడు ఒక్కటొక్కటే బయటికి వస్తున్నాయి. అసలు కరోనా వైరస్ పుట్టుకకు కారణమేంటన్నది ఇప్పటికీ తేలకపోగా.. చైనా జరిపిన జీవ రసాయన ప్రయోగాలే కరోనా వైరస్ పుట్టుకకు కారణమా లేక ఏదైనా జంతువులు, క్షీరదాల ద్వారా కరోనా వైరస్ ఉద్భవించిందా అన్నదింకా తేలలేదు. అయితే.. కరోనా వైరస్‌ గుర్తించిన వెంటనే అది ప్రారంభమైన వూహన్ నగరంతోపాటు వైరస్ విస్తరణకు అవకాశమున్న ఏరియాలను లాక్ డౌన్ చేసింది డ్రాగన్ దేశం. ఈ క్రమంలోనే కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్‌ను కనుగొన్నామని చైనా చాటుకుంది. కానీ దాదాపు ఏడాది తర్వాత చైనా దేశం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వట్టి డొల్లేనని ఆ దేశానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CENTRE FOR DISEASE CONTRO – CDC) వెల్లడించింది. దాంతో చైనా దేశంలో జరిగేది ఒకటి .. బయటి ప్రపంచానికి తెలిసేది మరొకటని మరోసారి ప్రూవ్ అయ్యింది.

చైనా కరోనా నిరోధక టీకాలపై తొలి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. తమ వ్యాక్సిన్ల డొల్లతనాన్ని డ్రాగన్ కంట్రీ ఉన్నతాధికారే స్వయంగా బయటపెట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా వ్యాక్సిన్లకు తక్కువేనని ప్రకటించారు. దీంతో తమ దేశంలో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లను కలగలిపి.. వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని చైనా ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌-సీడీసీ’ గావో ఫూ తెలిపారు.

చైనా వ్యాక్సిన్లకు కరోనా నుంచి కాపాడే సామర్థ్యం అధికంగా లేదు. వీటిని వినయోగించాలా? లేదా? అన్నదానిపై సమాలోచనలు జరపుతున్నామని గావో తెలిపారు. అలాగే పశ్చిమ దేశాల వ్యాక్సిన్లపై ఒకప్పుడు అక్కసు వెళ్లగక్కిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని ఒప్పుకోక తప్పలేదు. కరోనా టీకాలను తయారు చేయడానికి ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ పద్ధతిని స్వయంగా గావోయే తప్పుబట్టారు. దీనివల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు ఆయనే.. ఎంఆర్‌ఎన్‌ఏ (MRNA) విధానంలో టీకాలు తయారుచేసే ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చైనా వ్యాక్సిన్లను సంప్రదాయ వ్యాక్సిన్ ఉత్పత్తి విధానాన్ని ఉపయోగించి తయారుచేశారు.

చైనాకు చెందిన సినోవ్యాక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు 50.4 శాతం సామర్థ్యం ఉందని బ్రెజిల్‌ తేల్చింది. అదే అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్‌ టీకా సామర్థ్యం 97 శాతం అని రుజువైంది. ఇప్పటి వరకు చైనాలో 34 మిలియన్ల మందికి రెండు డోసుల టీకా అందించారు. మరో 64 మిలియన్ల మందికి ఒక డోసు వేశారు. ఇక టీకా దౌత్యం పేరిట వివిధ దేశాలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించిన చైనా.. ఇప్పటి వరకు కొన్ని కోట్ల డోసులను విదేశాలకు సరఫరా చేసింది. చైనాలో తయారైన ఏ వస్తువైనా తక్కువ నాణ్యత అన్న అభిప్రాయం యావత్ ప్రపంచంలో వుంది. ఇది తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు కూడా వర్తించడం యాదృచ్ఛికమే అన్న ఫీలింగ్ వినిపిస్తోంది.

ALSO READ: ప్రచార పర్వంలో సవాళ్ళ జోరు.. హీటెక్కుతున్న తిరుపతి ఉప ఎన్నిక.. సై అంటే సై