AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తరూపు సంతరించుకోనున్న కేంద్ర సివిల్ సర్వీసులు

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన సివిల్‌ సర్వీసులు ప్రధానమంత్రి పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పరిపాలనకు ఇరుసులాంటి ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ‘మిషన్‌ కర్మయోగి’ పేరుతో కొత్తపథకాన్ని కేంద్రప్రభుత్వం తీసుకువస్తోంది.

కొత్తరూపు సంతరించుకోనున్న కేంద్ర సివిల్ సర్వీసులు
Balaraju Goud
|

Updated on: Sep 03, 2020 | 6:28 AM

Share

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన సివిల్‌ సర్వీసులు ప్రధానమంత్రి పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పరిపాలనకు ఇరుసులాంటి ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ‘మిషన్‌ కర్మయోగి’ పేరుతో కొత్తపథకాన్ని కేంద్రప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, విద్యావేత్తలు సభ్యులుగా ఉండే ఈ మిషన్‌కు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులకు వ్యక్తిగతంగా, సంస్థాగతంగా అత్యుత్తమ, అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ఏకీకృత కెపాసిటీ బిల్డింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది తమ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద మానవ వనరుల అభివృద్ధిసంస్కరణ అని కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రకటించారు. నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ కెపాసిటీ బిల్డింగ్‌ (ఎన్‌పీసీఎస్‌సీబీ)గా కూడా పిలుస్తున్న ఈ పథకానికి 2020 21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 25 వరకు దాదాపు రూ.510.86 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నామన్నారు. ‘ఐగాట్‌ కర్మయోగి’ పేరుతో సమీకృత శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పుతామన్న మంత్రి.. ఈ సంస్థ నిర్ణయించే విధానాలను ప్రభుత్వ పరిధిలోని దాదాపు 46లక్షల మంది ఉద్యోగులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తామని జవదేకర్ తెలిపారు.

దేశంలో అత్యున్నత ఉద్యోగాలైన సివిల్‌ సర్వీసుల నుంచి అట్టడుగున ఉండే క్లర్క్‌ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రస్తుతం గందరగోళంగా ఉన్నాయి. నూతన సవాళ్లను ఎదుర్కొనేలా ఉద్యోగులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వనున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమనుతాము మెరుగుపర్చుకోవడానికి వీలుకల్పిస్తున్నారు. సమస్యలన్నింటినీ అధిగమించేందుకు మిషన్‌ కర్మయోగి కార్యక్రమాన్ని రూపొందించారు. ‘మిషన్‌ కర్మయోగి ప్రభుత్వ ఉద్యోగికి పునర్జన్మనిస్తుంది. దేశసేవే పరమధర్మంగా జీవించే ఆదర్శ కర్మయోగిగా మార్చుతుంది. ఉద్యోగిని సాంకేతికంగా స్వయం సమృద్ధం చేసి క్రియాశీలంగా, నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా పనిచేసేలా మార్చుతుంది’ అని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. నూతన భారతదేశ నిర్మాణానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం, వైఖరులను ఉద్యోగుల్లో పెంపొందించటానికి మిషన్‌ కర్మయోగి దోహదపడుతుందని సిబ్బంది వ్యవహారాలశాఖ కార్యదర్శి సీ చంద్రమౌళి తెలిపారు.