ఏపీతో ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

ఏపీతో ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు..
Follow us

|

Updated on: Sep 03, 2020 | 6:47 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి , విజయనగరం జిల్లా బలిజిపేట , విశాఖ జిల్లా కశింకోట , పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, గుంటూరు జిల్లా రాజుపాలెం, ప్రకాశం జిల్లా ఉలవపాడు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా కూడేరు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారుల్లో భారీ అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను గుర్తించారు. ‘స్పందన’, ‘మీ సేవ’ పోర్టళ్లలో చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పరిష్కరించ లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కొన్ని కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల స్థానాల్లో ప్రైవేట్‌ సిబ్బంది పని చేస్తున్నారని గుర్తించారు.

మరోవైపు రిజిస్ట్రార్ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు, చిత్తూరు జిల్లా పీలేరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.9,23,940 స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా గూడురు మున్సిపల్‌ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని ఏసీబీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేదిలేదన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వేటు పడనుంది. సీఎం జగన్ ఆదేశాలతో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.