త్వరలో సిఎం జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా.. ఇల్లంతకుంట టీఆర్‌ఎస్ సమావేశంలో రసమయి బాలకిషన్ ఆసక్తికర కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం హోరెత్తుతుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటూ..
రాజన్న సిరిసిల్లా జిల్లాకు త్వరలోనే CM జిల్లాగా గుర్తింపు రాబోతుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రసమయి బాలకిషన్ వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం హోరెత్తుతుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటూ మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఒకడుగు ముందుకేసి నేరుగా కేటీఆర్‌కే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలో మానకొండూరు ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి మాట్లాడారు. అభివృద్దిలో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్లా జిల్లా ను గౌరవ మంత్రి కేటీఆర్ ముందు వరుసలో నిలిపారని చెప్పారు. త్వరలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా సీఎం జిల్లాగా మారబోతుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో సభ చప్పట్లతో మారమోగింది. ఇలా వరుసగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేటీఆర్ అంటూ కామెంట్స్ చేస్తుండటం ఆసక్తిగా మారింది.