Medical Oxygen: ఆక్సిజన్ అందక గాలిలో కలుస్తున్న ప్రాణాలు.. పెరిగిన డిమాండ్, అందని సరఫరా.. వేధిస్తున్న కొరత
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో మంగళవారం ఆక్సిజన్ అందక కొవిడ్ రోగుల మరణాలు నమోదయ్యాయి.
Medical Oxygen: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో మంగళవారం ఆక్సిజన్ అందక కొవిడ్ రోగుల మరణాలు నమోదయ్యాయి. కరోనా మొదటి వేవ్‌లో వెంటిలేటర్ల కొరతతో ఎక్కువ మరణాలు నమోదవ్వగా.. సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరత వారి ఉసురు తీస్తోంది. నీతిఆయోగ్, ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో.. మొదటివేవ్‌లో 41.1 మందికి ఆక్సిజన్ బెడ్ల అవసరం ఉండగా.. ఇప్పుడు ఆ డిమాండ్ 54.5 శాతానికి చేరిందని తేలింది. దీన్ని బట్టి, డిమాండ్‌కు తగ్గట్లుగా ఆక్సిజన్ అందకపోతే.. ప్రాణవాయువు లేక కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నా.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నా కేసులు భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. దీంతోపాటు రాష్ట్రంలో వైద్యం పరంగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందక ఇప్పటికే చాలామంది మరణించారు. దీంతోపాటు వ్యాక్సిన్ కొరత కూడా వేధిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వ్యాక్సిన్ డోసులను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా కేంద్రాన్ని కోరుతోంది.
దేశంలో కరోనా బాధితుల దీనావస్థ, ఆసుపత్రుల్లో దురవస్థ ఎలా ఉందో అద్దం పడుతోంది. ఒకే బెడ్ మీద మీద ఇద్దరు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల ఆసుపత్రి కాదు. ఢిల్లీలోని ప్రఖ్యాత లోక్‌నాయక్ జయ్ ప్రకాష్ హాస్పటిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు కరోనా బాధితులకు ఒకే బెడ్ అందిస్తున్నారంటే బెడ్స్ కొరత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకే బెడ్‌మీద ఇద్దరు బాధితులకు చికిత్స అందించడం షాకింగ్‌గా ఉంది. కొత్తగా బెడ్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఇప్పటికే ఉన్న బాధితులకు ఆక్సిజన్ కూడా అరకొరగా మారిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు లోక్‌నాయక్ జయప్రకాష్‌ఆసుపత్రిలోనే ఉన్నాయా? ఇంకా ఇతర నగరాల్లోని ఏవైనా ఆసుపత్రుల్లో ఉన్నాయా అన్నది ఆసక్తిగా మారింది.
ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల్లోని బెడ్స్‌ను కోవిడ్ కోసం వాడే కార్యక్రమం మొదలైంది. మరోవైపు సైనిక ఆసుపత్రులను కూడా కోవిడ్ సేవల కోసం వినియోగించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అదనంగా 2105 బెడ్స్‌ను కేంద్రప్రభుత్వం అందించింది.
ఇక కరోనాతో పోరాడుతున్న మన దేశంలో రెమ్‌డెసివిర్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ ఇంజక్షన్ వయల్స్ బ్లాక్‌మార్కెట్లో అమ్ముడు అవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్రప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఇవాళ్టి నుంచి 10 రోజులపాటు అన్ని రాష్ట్రాలకు కేంద్రం రెమ్‌డెసివిర్ వయల్స్‌ను కేటాయిస్తోంది. ఆక్సిజన్ కేటాయింపుల ఆధారంగా ఈ వయల్స్‌ను కేటాయిస్తారు.
దేశంలో ఆక్సిజన్ కొరత వల్లే ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో ఢిల్లీకి పెద్ద సంక్షోభం తప్పింది. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా నిండుకున్న పరిస్థితుల్లో దేశ రాజధానిలోని ఆసుపత్రులకు కొత్త స్టాక్ అందింది. అర్థరాత్రి నుంచి ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సిజన్ అందుతోంది. ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు వివిధ మార్గాల్లో ఆసుపత్రులకు చేరుతున్నాయి.
డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ బ్లాక్‌మార్కెట్, లూటీ కామన్ అయిపోయాయి. మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ సిలిండర్లను లూటీ చేశారు. దమోహ్ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రికి సిలిండర్ల ట్రక్ వచ్చింది. వెంటనే ట్రక్‌ను ఎత్తుకుపోయారు. కోవిడ్ బాధితుడి బంధువులే ఈ సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆసుపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక ఏడుగురు కొవిడ్ రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ కోసం పదేపదే వినతులు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువవ్వడంతో ఈ దుస్థితి నెలకొందని రోగుల బంధువులు ఆరోపించారు. మిగతా రోగుల ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు సమీప ప్రాంతాల్లోని అంబులెన్స్‌లను రప్పించి, వాటిల్లోని ఆక్సిజన్‌ను అందజేస్తున్నారు. కర్ణాటకలో విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్ వ్యక్తిగత కార్యదర్శి రమేశ్ మంగళవారం కొవిడ్‌తో మృతిచెందారు. ఆయనకు సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో చనిపోయారని వైద్యులు తెలిపారు.
వరంగల్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఒకవైపు కోవిడ్ బాధితులు పెరుగుతున్న పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు సిలిండర్లు అందని పరిస్థితి. దీంతో ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడం కోసం పరిశ్రమల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను అందించాలని ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్యాలు మొరపెట్టుకున్నాయి.
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కూడా పరిశ్రమలు ఆక్సిజన్‌ను ఎగుమతి చేసి అమ్ముకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 20 సంవత్సరంలో 4,514 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భారత్.. ఇతర దేశాలకు ఎగుమతి చేసి 5.5 కోట్ల రూపాయలను సంపాదించింది. 2020 21 జనవరి వరకు భారత్ అందుకు రెట్టింపు స్థాయిలో , అంటే 9301 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఎగుమతి చేసి 8.9 కోట్ల రూపాయలు సంపాదించింది. దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన ఈ సమయంలో పరిశ్రమలకు అందుతున్న ఆక్సిజన్‌ను కూడా ఆసుపత్రులకే అందిస్తున్నారు.
మరోవైపు, ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అవసరాలకు సరిపోయే విధంగా ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా చేస్తామని హర్షవర్ధన్ కేంద్ర ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. అలాగే మహారాష్ట్రలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. రాష్ట్రానికి అదనంగా మరో 1,121 వెంటిలేటర్లను అత్యవసరంగా పంపుతున్నట్లు పేర్కొన్నారు.
ఆ రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్లు లేకపోవడంతో.. ఇతర రాష్ట్రాలవైపు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ల రీఫిల్లింగ్ చార్జీలు కూడా పెరిగాయి. ఈనేపథ్యంలో 50 వేల టన్నుల ప్రాణవాయువు దిగుమతికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. రిలయెన్స్ ఇండస్ట్రీ్‌సకు చెందిన జామనగర్ ఆయిల్ రిఫైనరీలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో మరో 700 టన్నులు రాష్ట్రాలకు ఉచితంగా అందనుంది.
జిందాల్ స్టీల్స్‌కు చెందిన బళ్లారి ప్లాంట్ నుంచి 1,600 టన్నుల ప్రాణవాయువు మంగళవారం హైదరాబాద్ చేరింది. దీన్ని రెమ్‌డెసివిర్ ఉత్పత్తిదారులైన హెటిరో, మైలాన్‌కు అందజేశారు. గడిచిన రెండు రోజులుగా కొవిడ్ క్రిటికల్ కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
నిల్వ సామర్థ్యం తక్కువ ఉండడంతో పరిస్థితి జటిలం!
గాలిలో 20.6శాతం ఆక్సిజన్, 78.03శాతం నైట్రోజన్, 0.93 శాతం ఆర్గాన్ గ్యాస్, ఇతర మూలకాలు ఉంటాయి. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లలో గాలి నుంచి ప్రాణవాయువును తయారు చేస్తారు. మైనస్ 183 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద క్రయోజనిక్ ఎయిర్ సప్రెషన్ విధానం ద్వారా ఆక్సిజన్‌ను వేరు చేస్తారు. అలా గ్యాస్ రూపంలో లభ్యమయ్యే ప్రాణవాయువును ద్రవరూపంలోకి మార్చి వడబోస్తే.. 99.9శాతం స్వచ్ఛతతో ఆక్సిజన్ లభిస్తుంది. ఇలా లక్ష ఘనపు మీటర్ల సాధారణ గాలిని గంట పాటు ప్రాసెస్ చేస్తే.. 13,500 నుంచి 18,500 ఘనపు మీటర్లలో ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా తయారైన ఆక్సిజన్‌ను జంబో ట్యాంకర్లలో స్టోర్ చేస్తారు. నిర్ణీత ఉష్ణోగ్రతలో క్రయోజనిక్ ట్యాంకుల ద్వారా ఈ ఆక్సిజన్‌ను డిస్ట్రిబ్యూటర్లకు పంపుతారు. డిస్ట్రిబ్యూటర్లు ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్‌ను రీగ్యాసిఫికేషన్ ద్వారా మళ్లీ గ్యాస్ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దాన్ని ఆస్పత్రులకు పంపుతారు. దేశంలోని చాలా ఆస్పత్రుల్లో.. డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఆక్సిజన్‌ను నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.